“సెలవు కావాలా? ఎందుకు? మొగుడు తోడు లేని నువ్వు సెలవు తీసుకొని ఏం చేస్తావ్? ముందు లాడ్జ్‌కు రా.. ఆ తర్వాత చూద్దాం.. “ సెలవు అడిగిన ఓ మహిళ ఉద్యోగికి పై అధికారి నుంచి వచ్చిన సమాధానమిది. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో మహిళా ఉద్యోగుల పట్ల ఓ కామాంధుడు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకే మచ్చ తెచ్చే విధంగా మారింది. కర్ణాటకలోని కొప్పళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే మల్లినాథ్ అనే నీచుడు.. తన కిందస్థాయి ఉద్యోగినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో సీసీ కెమెరాల ఆధారంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
ఇటీవల కారుణ్య నియామకం కింద ఆఫీస్ లో చేరిన ఓ మహిళపై ఆ దుర్మార్గుడి కన్ను పడింది. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త చనిపోవడంతో.. అదే శాఖలో సదరు మహిళకు డీ గ్రేడ్ ఉద్యోగం ఇచ్చారు. భర్త చనిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె కష్టపడి పనిచేస్తూ ఆమె పిల్లలను పోషించుకుంటున్నది. ఈ క్రమంలో అవసరం మీద సెలవు కావాలని కోరడంతో లాడ్జ్ కు వస్తే సెలవులు ఇస్తానని మల్లినాథ్ చెప్పాడని తెలిసింది. 2019లో ఇతడిపై ఇటువంటి ఆరోపణలు రాగా అప్పట్లో షోకాజ్ నోటీసు ఇచ్చి సరిపెట్టారు. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారో లేదా గతంలో మాదిరిగానే షోకాజ్‌తో సరిపెడతారో వేచి చూడాల్సి ఉంది.