జీవితంలో కొన్న తొలి టికెట్‌కేకోటి లాటరీ తగిలింది.. - MicTv.in - Telugu News
mictv telugu

జీవితంలో కొన్న తొలి టికెట్‌కేకోటి లాటరీ తగిలింది..

February 10, 2021

vdgsg

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. లాటరీలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొన్నా ఒక్కసారి కూడా తగలదు కొందరికి. మరికొందరికి తక్కువ మొత్తాల్లో తగులుతుంటాయి. ఎవరైనా సరే లాటరీ కొంటున్నారంటే.. లక్షలు, కోట్లు వస్తాయనే ఆశతోనే, ఇష్టపూర్వకంగా కొంటారు. కానీ ఓ వ్యక్తి జీవితంలో తొలిసారి, తనకు ఇష్టం లేకున్నా స్నేహితుడి బలవంతంపై టికెట్ కొని కొన్ని గంటల్లోనే కోటీశ్వరుడయ్యాడు.

కర్ణాటకలోని మాండ్య జిల్లా సోనహల్లికి చెందిన సోహన్ బలరాంకు పట్టిన మహా అదృష్టం కథ ఇది. అతడు గత శనివారం ఓ మిత్రుడి పెళ్లి కోసం కేరళ వెళ్లాడు. వేడుక ముగిశాక తిరిగి సొంతూరికి బయలుదేరాడు. స్నేహితులు వీడ్కోలు పలుకుతూ లాటరీ షాపుకు తీసుకెళ్లాడు. లాటరీ దుకాణంలో పనిచేస్తున్న ప్రభాకరన్ అనే వ్యక్తి బలరాంకు ఫేస్ బుక్‌లో పరిచయం. స్నేహితుల మధ్య కబుర్లు సాగాయి. ఓ స్నేహితుడు బలరాంను కేరళ రాష్ట్ర లాటరీ టికెట్ కొని అదృష్టం పరీక్షించుకోమన్నాడు. అయితే బలరాం అంగీకరించలేదు. ‘నాకు తలుగుతుందా? వంద రూపాయలు వేస్ట్.. నేను కొనను..’ అన్నాడు. అయితే స్నేహితుడు వినకుండా బలవంతం చేశాడు. ‘ఓసారి కొంటే కొంపలేమీ మునిగిపోవు కదా. ఓ సినిమా చూడలేదనుకో..’ అన్నాడు. బలరాం ఇక తప్పదన్నట్టు టికెట్ కొన్నాడు. బలరాం జీవితంలో లాటరీ టికెట్ కొనడం అదే తొలిసారి.
కొన్ని గంటలు కూడా గడవక ముందే అతనికి లాటరీ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. మీ నంబరుకు లాటరీ తగిలిందని చెప్పడంతో బలరాం ఎగిరి గంతులేశాడు.