Karnataka: Murder accused allowed to stay in lodge with lover
mictv telugu

ప్రేయసితో లాడ్జిలో మర్డర్ కేసు నిందితుడు.. కాపలాగా పోలీసులు!

August 22, 2022

హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని ప్రేయసితో కలిసి ప్రైవేట్ లాడ్జిలో గడిపేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో ధార్వాడ్ నగరంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సహకరించి, కాపలాగా ఉన్న ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్‌ అనే వ్యక్తి హత్యకేసులో నిందితుడైన బచ్చాఖాన్‌ను శనివారం ధార్వాడ్‌లోని కోర్టులో హాజరుపరిచేందుకు బళ్లారి పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచిన తరువాత, పోలీసులు తిరిగి వెళ్ళే ముందు, నిందితుడు తన ప్రేయసితో కొంత సమయం గడిపేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరాడు. పోలీసులు అందుకు ఓకే చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కూడా ఆ స్థలంలో కాపలాగా ఉన్నారు.

అంతకుముందే బెంగళూరు నుండి వచ్చిన బచ్చాఖాన్ ప్రేయసి.. అతని కోసం ఆ లాడ్జిలో వేచి చూస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకుల్‌రోడ్‌ పోలీసులు ఆ లాడ్జిపై దాడి చేసి పోలీసు సిబ్బందిని, హత్య కేసు నిందితుడు బచ్చాఖాన్ను, అతడి ప్రేయసిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో బచ్చాఖాన్ గత 20 ఏళ్లుగా జైల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి అండగా నిలిచిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.