కర్ణాటక ముస్లిం పండ్ల వ్యాపారుల బహిష్కరణపై.. ఒవైసీ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటక ముస్లిం పండ్ల వ్యాపారుల బహిష్కరణపై.. ఒవైసీ ఫైర్

April 6, 2022

02

కర్ణాటక రాష్ట్రాన్ని నిన్న మొన్నటి వరకు హిజాబ్ వివాదం కుదిపేస్తే, ఇప్పుడు మరో కొత్త ఉద్యమం మొదలైంది. కర్ణాటకలో ఉన్న ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని హిందు జన జాగృతి సమితి, హిందూ మితవాద నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మొత్తం ముస్లింలే పండ్ల వ్యాపారాలు చేస్తున్నారని.. హిందువులు హిందూ వ్యాపారుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు.

 

”కర్ణాటక ప్రభుత్వం మూక పాలనను అమలు చేస్తోంది. ఎవరు ఏది విక్రయించాలి, ఎవరు ఎవరి నుంచి ఏది కొనుగోలు చేయాలన్నది ముఠాలే నిర్ణయిస్తాయి. ముస్లింల గుత్తాధిపత్యం అంటూ ఏదీ లేదు. ముస్లింల పట్ల అంటరానితనాన్ని అమలు చేయడానికి ఇదొక సాకు మాత్రమే. జన జాగృతి పేరుతో పేద ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు” అంటూ కర్ణాటక రాష్ట్రంలో పండ్ల వ్యాపార విషయంలో అక్కడి ముస్లింల ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటూ పలు సంస్థలు ఇచ్చిన పిలుపుపై బుధవారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పు బట్టారు.

ఇటీవలే కర్ణాటక హిందూ జనజాగృతి సమితి కోర్డినేటర్ చంద్రు మోగర్ ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ.. ”దాదాపు పండ్ల వ్యాపారం మొత్తం ముస్లింలే చేస్తున్నారు. హిందువులు హిందూ వ్యాపారుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలి. ముస్లింలు పండ్లను, బ్రెడ్లను అమ్మేముందు వాటిపై ఉమ్ము వేస్తున్నారు” అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

మరోపక్క హిందూ మితవాద నేత ప్రశాంత్ సంబర్గి మాట్లాడుతూ.. ‘పంటలను పండించేది హిందువుల రైతులు. దళారులుగా ఉండేది మాత్రం ముస్లింలు. దళారులుగా ఉంటూ ఆ ప్రతిఫలాన్ని ముస్లింలే లాగేసుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. అయినా, తాము మత సామరస్యాన్ని కోరుకుంటున్నామని, ఈ విధమైన ధోరణులకు తాము వ్యతిరేకమని కర్ణాటక మంత్రి అశ్వత్ నారాయణన్ అన్నారు.