కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. జిల్లాలోని బోలా గ్రామ పంచాయితీకి వెళ్లే రహదారిపై ‘నాథూరామ్ గాడ్సే రాస్తా’ అనే సూచిక బోర్డు పెట్టారు. సోమవారం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన గ్రామ పంచాయతీ అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డుపై ఉన్న బోర్డును తొలగించారు. బోర్డు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైన్బోర్డ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదిలా ఉంటే, నాథూరాం గాడ్సే పేరు మీద ఎప్పుడు, ఎవరు సైన్ బోర్డు పెట్టారో గ్రామ పంచాయతీకి తెలియడం లేదని పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) తెలిపారు.
ఈ బోర్డును ప్రభుత్వం, గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేయలేదని, ఇది కొందరి దుండగుల పని అని కర్నాటక ఇంధన శాఖ మంత్రి వి సునీల్ కుమార్ పేర్కొన్నారు. రెండు రోజుల కిందట తాము ఈ బోర్డును గుర్తించి పంచాయితీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశామని కర్నాటక యూత్ కాంగ్రెస్ చీఫ్ యోగేష్ ఇన తెలిపారు. కొందరు దుండగులు కావాలనే వివాదం రేపేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.