Karnataka People doing marrying to their died unmarried family persons
mictv telugu

సచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నం సామెతకు సాక్ష్యం.. వీడియో వైరల్

July 30, 2022

భారతదేశం అంటేనే విభిన్న సాంప్రదాయాలు, ఆచారాలన్న విషయం తెలిసిందే. ఒకే రాష్ట్రంలో కూడా వీటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అలాగే సామెతలకు మనదేశ భాషలు పేరుగాంచాయి. ఇలా తెలుగులో ఫేమస్ అయిన సామెతే ‘సచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నం’. అంటే చనిపోయిన వ్యక్తుల పెళ్లికి ఎంత కట్నం వచ్చినా అదంతా లాభమేనని అర్ధం. పై సామెతను నిజం చేసే పెళ్లి సాంప్రదాయం ఒకటి దక్షిణ కర్ణాటకలో జరిగింది. ఎప్పుడో చనిపోయిన పెళ్లి కాని వ్యక్తులకు అక్కడ పెళ్లి చేశారు. ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ఇంకా పాటిస్తున్నారు. ఇలా పెళ్లి చేయడం వల్ల తమ కుటుంబాల్లో చనిపోయిన వారి ఆత్మలకు ఈ రకంగా శాంతి కలుగుతుందని వారు భావిస్తారు. పూర్తి వివరాల్లోకెళితే.. పురిట్లో లేదా పుట్టిన తర్వాత చనిపోయిన వారి పెళ్లిళ్లలను వారికి యుక్త వయసు వచ్చాక జరిపిస్తారు.

ఇందుకోసం మామూలు పెళ్లి సంబంధాలు చూసినట్టే వధువు/వరుడి కోసం అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి సంబంధం కుదుర్చుకుంటారు. వరుడి కంటే వధువు వయసు చిన్నగా ఉండేలా జాగ్రత్త పడతారు. కులం, గోత్రం పట్టింపులు ఎలాగూ ఉంటాయి. పెళ్లి పీటల మీద వధూవరులు లేకున్నా వారున్నారని భావించి పెళ్లి వస్త్రాలతో కుర్చీలను అలంకరిస్తారు. వధూవరుల తరపున వారి కుటుంబ సభ్యులు ఏడడుగులు నడిచి పెళ్లి తంతు పూర్తి చేస్తారు. తర్వాత మామూలు పెళ్లిలాగే మాంసాహార, శాకాహార భోజనాలు పెడతారు. ఈ వివాహాలకు బంధుమిత్రులను ఆహ్వానించి వారిని తృప్తి పరుస్తారు. అలాగే నిజం పెళ్ళి లాగే వర కట్నకానుకలు, అతిథుల చదివింపులు ఉంటాయి. బయటివారికి ప్రేతాత్మల పెళ్లిలా అనిపించినా వారు మాత్రం అలా ఏమాత్రం ఫీల్ అవ్వరు. పైగా ఇలాంటి పెళ్లిళ్లు చేయడం గౌరవంగా భావిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.