ఎమ్మెల్యే ఇంటి వద్ద నిప్పు పెట్టిన ఆందోళనకారులు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే ఇంటి వద్ద నిప్పు పెట్టిన ఆందోళనకారులు

August 12, 2020

Karnataka Protesters In Front Of MLA House

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి వద్ద కొంత మంది ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఓ దశలో ఆయన ఇంటికి కాల్చేసే ప్రయత్నం చేయబోయారు. పులికేసినగర్‌లోని శ్రీనివాస మూర్తి నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పెట్రోలు పోసి ఇంటి ముందు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు కాల్పులు జరపగా.. ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వందలాది మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. 

శ్రీనివాసమూర్తి మేనల్లుడు ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. అది ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని మతపరమైన నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పలు వాహనాలకు నిప్పుపెట్టడంతో హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో 60మంది పోలీసులు గాయపడినట్లు బెంగళూరు సీపీ కమల్ పంత్ తెలిపారు. దీనికి కారణమైన 110 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కేజీ హల్లి, డీజే హల్లి  కర్ఫ్యూ విధించారు. ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.