ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, విపక్ష నాయకులు ఓట్ల కోసం ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలు అయితే అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇస్తుంది కానీ అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు కొద్ది నెలల ముందు కొత్త పథకాలను ప్రకటించి అమలు చేయడం గతంలో చూశాం. ఇప్పుడు ఈ కోవలో కర్ణాటక ప్రభుత్వం చేరింది. రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రతీనెలా రూ. 2 వేల నగదును సాయంగా అందిస్తామని రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ గురువారం ప్రకటించారు. జులై నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని, వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథక విధివిధానాలను సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడిస్తారన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని, మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. మరోసారి అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ఇలాంటి పథకాన్ని ప్రకటించారు. కుటుంబంలో ప్రతీ పెద్ద మహిళకు నెలకు రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ. 24 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అటు త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడం తెలిసిందే.