నిన్న సీఎం, నేడు మాజీ సీఎం.. కర్నాటకలో కరోనా కల్లోలం - MicTv.in - Telugu News
mictv telugu

నిన్న సీఎం, నేడు మాజీ సీఎం.. కర్నాటకలో కరోనా కల్లోలం

August 4, 2020

Karnataka Siddaramaiah EX CM Test Positive

కర్నాటకలో కరోనా భూతం జడలువిప్పుతోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతూ.. జనాలను భయాందోళనకు గురి చేస్తోంది. సామాన్యులే కాదు.. ప్రజా ప్రతినిధులు కూడా వరుసగా వ్యాధిబారిన పడుతున్నారు. ఏకంగా ఇటీవల సీఎం యడియూరప్పకు వైరస్ లక్షణాలు బయటపడగా.. తాజాగా మాజీ సీఎంకు కూడా వ్యాధి నిర్ధారణ అయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్యకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సిద్ధ రామయ్య నెల రోజులుగా మూత్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగుళూరులోని మణిపూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్సకు ముందే ఆయనకు కరోనా టెస్టు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఆయన నివాసం, పార్టీ ఆఫీసు ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు. ఇటీవల ఆయన్ను కలిసిన వారు ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ కరోనా బారిన పడటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.