Karnataka young farmers complaint to Tehsildar about not giving bride to farmers
mictv telugu

యువరైతులకు వధువుల కొరత.. ప్రభుత్వానికి ఫిర్యాదు

November 23, 2022

దేశానికి అన్నం పెట్టేందుకు రైతు కావాలి. కానీ, రైతుకి పిల్లను మాత్రం ఇవ్వరు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయం తర్వాత వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. దీంతో చాలా మంది యువరైతులు పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. కానీ, కర్ణాటకకు చెందిన కొందరు యువరైతులు మాత్రం నిరాశలో కుంగిపోకుండా ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా హోసళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. రైతు అనే కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎక్కడా వధువు దొరకడం లేదని తహసీల్దార్ ఎదుట వాపోయారు. రైతుల ఇళ్లలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఎండకు, వానకు శ్రమించాల్సి వస్తుందని అమ్మాయిల పేరెంట్స్ భయపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా వ్యవసాయం అంటే జూదంలా మారడంతో కన్యను ఇవ్వడానికి నిరాసక్తత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగం ఉంటే పిల్లనిస్తామంటున్నారు. అలాంటప్పుడు రైతు పిల్లలు రైతు కావాలా? వద్దా? అని గ్రామసభకు వచ్చిన తహసీల్దార్ ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పట్టించుకొని జనంలో చైతన్యం కల్పించాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కాగా, గ్రౌండ్ లెవెల్లో ఈ సమస్య మెల్లిగా తీవ్రతరం అవుతోందని, యువరైతులను వేధిస్తోందని సామాజిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని లేకపోతే ఈ అంశం ప్రధాన స్రవంతిలోకి రాకముందే ఓ తరం బ్రహ్మచారులుగా తమ జీవితాన్ని ముగించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు..