నిన్నటి వరకు గ్రీన్.. ఒక్కసారిగా 21 మందితో రెడ్
ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఉండవు అంటారు. కానీ ఇప్పుడున్న కరోనా కాలంలో ఇప్పుడున్న పరిస్థితులు ఇంకాసేపు అయ్యాక ఉండలేకుండా పోతున్నాయి. మా ప్రాంతం గ్రీన్ జోన్‌లో ఉందని గుండె మీద చేయి వేసుకుని తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే పొందుతున్నారు. అంతలోనే కరోనా ఉపద్రవం ముంచుకొచ్చి గ్రీన్ జోన్ ప్రాంతం కాస్తా రెడ్ జోన్‌గా మారిపోతోంది. కర్ణాటక రాష్ట్రంలోరి దావణగెరె జిల్లా నిన్నటి వరకూ గ్రీన్ జోన్‌లో ఉంది. వారం రోజుల క్రితం కంటైన్‌మెంట్ పీరియడ్ ముగియడంతో ఈ ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు కాసింత రిలాక్స్ అయ్యారు. మరోవైపు రేపటినుంచి అన్నీ కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులు భావించారు. ఇంక ఫ్రీడం దొరికిందని ప్రజలు కూడా ఆనందపడ్డారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఒక్కరోజులోనే 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతం రెడ్ జోన్‌లోకి మారిపోయింది. జిల్లాలో సడలింపులను ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చెయ్యాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కరోజులేనే ఆ ప్రాంతంలోని పరిస్థితులను కరోనా తారుమారు చేయడంతో ప్రజలందరూ మళ్లీ బిక్కు బిక్కుమనాల్సి వచ్చింది.
ఆ ప్రాంతంలోని కొందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. దీంతో 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపారు. వారిలో 21 మందిలో వైరస్ ఉన్నట్టుగా తేలింది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. అయితే ఎవరి నుంచి వారికి కరోనా వ్యాపించిందనేది తెలియరాలేదు. ఈ వ్యవహారం అధికారులకు కాస్త తలనొప్పిగానే మారింది. కాగా, గతంలో ఈ జిల్లాలో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు చనిపోయారు. కొత్తగా ఒకేసారి 21 కేసులు నమోదవడంతో రోగుల సంఖ్య 10 నుంచి 31కి చేరుకుంది. జాలి నగర్ ప్రాంతంలో కరోనా వ్యాప్తిని అంచనా వేయడానికి సామాజిక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ మహంతేష్ తెలిపారు.