తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

October 26, 2022

Karthika Masam starts today.. Heavy inflow of devotees at Shiva Temples

శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. నేటి నుంచి మొదలయ్యే ఈ మాసం వచ్చే నెల నవంబర్ 23తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. శ్రీశైలంలో నేటి నుండి నవంబర్ 23 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. పాతాళగంగలో పుణ్యస్నానాలు, కార్తీక దీపారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవస్థానం.. భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు గంగాధర మండపం, శివ మాడవీధి ఏర్పాటు చేశారు. కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు, మొత్తం15 రోజులు స్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Karthika Masam,  Begins today,  Heavy inflow ,  devotees ,  Shiva Temples

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యల్లో భక్తులు తరలివచ్చారు. శైవక్షేత్రాలైన కొమరవెల్లి మల్లన్న, ఐలవోను మల్లికార్జునస్వామి, చెరువుగట్టు, కోటిలింగాల, ధర్మపురి.. ఇలా రాష్ట్రంలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వరంగల్ వేయిస్తంభాల దేవాలయం, రామప్ప రామలింగేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అటు కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో మహిళలు దీపాలను వదిలారు. ఆలయాల్లోనూ  మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

కార్తీక మాసాన్ని శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ నెలలో శివకేశవులను సమానంగా ఆరాధిస్తారు. ఈ నెల రోజుల పాటు శైవ, వైష్ణవ భక్తులు అత్యంత నియమనిష్టలతో శివకేశవులను పూజిస్తారు. ఇక ప్రముఖ శైవక్షేత్రాలు, వైష్ణవ ఆలయాలు శివ కేశవుల నామస్మరణతో మార్మోగిపోతాయి.