కర్తీకదీపం v/s ఐపీఎల్.. టీవీ కొనిచ్చిన వంటలక్క - MicTv.in - Telugu News
mictv telugu

కర్తీకదీపం v/s ఐపీఎల్.. టీవీ కొనిచ్చిన వంటలక్క

September 19, 2020

deepa

ఇంట్లో టీవీ సీరియళ్లు చూసే ఆడవాళ్లతో క్రికెట్ మ్యచ్ మొదలైనప్పుడే మగవాళ్లకు అసలు సమస్య మొదలవుతుంది. నేను మ్యాచ్ చూస్తానని భర్త అంటే.. లేదు నేను సీరియల్ చూస్తానని భార్య అంటుంది. వీరి మధ్యలోకి పిల్లలు వచ్చి మాకు కార్టూన్ ఛానల్ కావాలని మారాం చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో ఇంటికి మూడు టీవీలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కొందరు ఆ వెలితిని స్మార్ట్‌ఫోన్ల ద్వారా తీర్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యే ఓ వ్యక్తికి ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ‘కార్తీకదీపం’ సీరియల్‌ కోసం ఐపీఎల్‌ సమయాన్ని మార్చాలంటూ సూర్యాపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్‌ టీమ్‌, స్టార్‌ మాకి ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘ఇది అందరి ఇళ్లల్లో చాలా సీరియస్‌ ఇష్యూ. కార్తీక దీపం సీరియల్ కోసం ఐపీఎల్‌ మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని స్టార్‌ మా ఛానల్‌ను కోరుతున్నాను’ అని ట్వీట్‌‌లో పేర్కొన్నాడు. దీనిపై స్టార్‌ మా సానుకూలంగా స్పందించింది. 

అయితే శివచరణ్ ట్వీట్ గురించి కార్తీకదీపంలో హీరోయిన్‌ దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్‌కు తెలిసింది. తన సీరియల్‌ని, తనని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానిస్తారని తెలుసు కానీ, ఒక సీరియల్‌ను మరీ ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చడం కుదరని పని అని గ్రహించిన ఆమె వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఓ మంచి స్మార్ట్ టీవీ కొని వారికి బహుమతిగా పంపించింది. టీవీతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా శివచరణ్ ఇంటికి పంపించింది. ఆ ఉత్తరంలో.. ‘ఇప్పుడు మీ ఇంట్లో టీవీ కోసం గొడవపడే ఏ సమస్య లేదు. ఇకపై రాదు కూడా. మీ కుటుంబసభ్యులు ఒక టీవీలో కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే, మరొక టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది. నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది. దీప పంపిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి ఎంతో ఆనందించానని శివచరణ్ తెలిపాడు. కాగా, స్టార్ మా చానెల్లో ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సీరియల్ మొదలైన దగ్గరి నుంచి అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ సీరియల్‌ మాటీవీలో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. తాజాగా ఇదే సమయంలో ఈరోజు నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ మ్యాచ్‌లు కూడా మొదలవుతున్నాయి.