అమ్మా, బాపూ.. క్షమించండి! వాళ్లు వేధిస్తున్నారు.. చనిపోతున్నా! - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మా, బాపూ.. క్షమించండి! వాళ్లు వేధిస్తున్నారు.. చనిపోతున్నా!

February 14, 2018

‘అమ్మ, బాపు.. నన్ను క్షమించండి. ఒక కొడుగ్గా నేను మీకు ఏమీ చేయలేకపోతున్నా. వచ్చే జన్మలో కూడా మీ కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. నా గురించి ఏడవద్దు.. బాధ పడవద్దు. నా జీవితం ఇక ఇంతే. అన్నా – వదిన, అక్క – బావ పిల్లలందరూ నన్ను క్షమించండి. నా గురించి అస్సలు ఏడవకండి ’ అని ఆఖరిసారిగా సింగం కరుణాకర్ రాసిన అక్షరాలు వారి కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నాయి.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నకరుణాకర్ తన ఆఫీసులో  సీనియర్ అధికారులు  వేధింపులు తాళలేక, ఎక్కువ పని చేయించుకోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని లేఖలో పేర్కొన్నాడు. ‘నా ఆత్మహత్యకు కారణమైన బయోలాజికల్ ( బీఈ ) కంపెనీలోని మైక్రో బయోలజీ సూపర్‌వైజర్, మేనేజర్లు అయిన  చంద్రశేఖర్, సీహెచ్. కుమార్ రాజా, ఎమ్. శ్రీకాంత్‌‌‌లను  కఠినంగా శిక్షించాలనేది నా చివరి కోరిక ’ అంటూ తన లేఖలో తెలిపాడు.

అతను చనిపోతూ తీసిన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆత్మహత్యకు కారకులైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘56 సంవత్సరాలుగా వున్న బయోలాజికల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగటం తొలిసారి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) ఆడిటింగ్ వుండటంతో మేనేజర్, సూపర్ వైజర్లు ఉద్యోగులపై పనిభారాన్ని మోపారు. రూల్స్ ప్రకారం ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటే హెచ్‌ఆర్‌కు సమాచారం అందించాలి. కానీ వీళ్ళు అలాంటివేమీ చెయ్యకుండా ఉద్యోగులతో పగలూ, రాత్రుళ్ళు పని చేయించుకున్నారు. ఓటీ కూడా కట్టించకుండా పని చేయించుకున్నారు. పైగా మేనేజర్ పచ్చి బూతులు తిట్టడం వల్ల సున్నిత మనస్కుడైన కరుణాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని తెలిపారు.

మూణ్ణెల్ల క్రితం ఆ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్‌గా జాయినయ్యాడు కరుణాకర్. నేరెడ్‌మెట్‌లో ఒక బ్యాచిలర్ రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి వుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. హెచ్ఆర్‌కు కనీసం మెయిల్ ద్వారానైనా తెలిపి ఉద్యోగులతో పని చేయించుకోవాలి. అలాంటిదేమీ చేయకుండా, పైగా నోటికొచ్చినట్టు తిట్టి ఒక ఉద్యోగి ప్రాణాలు తిన్న ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కూడా ఆ మేనేజర్‌ పని చేసిన కంపెనీలో అలాంటి పేరే వుందట. క్రింది స్థాయి ఉద్యోగులను హింసించటం, బూతులు తిట్టేవాడట. కాగా కరుణాకర్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వటానికి కంపెనీ ముందుకొచ్చింది.