Kashi Vishwanath Temple To Offer Devotees 'Prasad' Made From Millets
mictv telugu

కాశీ ఆలయం ప్రసాదంగా ‘మిల్లెట్స్’ లడ్డూలు

March 6, 2023

Kashi Vishwanath Temple To Offer Devotees 'Prasad' Made From Millets

దేశంలో చిరుధాన్యాల (మిల్లెట్స్‌) ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో గల కాశీ విశ్వనాథ దేవాలయంలో మిల్లెట్‌లతో చేసిన లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆలయ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ మిల్లెట్లను ‘శ్రీ అన్న’గా సంబోధించగా.. కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ‘శ్రీ అన్న ప్రసాదం’గా నామకరణం చేసి పంపిణీ చేయనున్నట్లు వారణాసి ముఖ్య అభివృద్ధి అధికారి హిమాంశు నాగ్‌పాల్‌ వివరించారు. ఇకపై దీనిని ‘శ్రీ అన్న ప్రసాదం’గా పిలవనున్నట్లు తెలిపారు.

ఈ లడ్డూలను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేయనున్నట్లు తెలిపారు. వీటి తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ‘దేశీ నెయ్యిలో మినుములు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేస్తున్నాం. సంపూర్ణ స్వచ్ఛతను నిర్ధారిస్తాం. ఇప్పుడు సిద్దం చేసే లడ్డూలపై “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023” లోగో కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం’.. అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్ తెలిపారు.

ఇప్పటివరకు ప్రసాదం తయారు చేస్తున్న నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ వారే శ్రీ అన్న ప్రసాదాన్ని కూడా అందజేయనున్నారు. బరువులో కానీ, ధరలో కానీ తేడా ఉండదని, అలాగే పూర్తి శుభ్రత, నాణ్యతతో తృణ ధాన్యాలు, జీడిపప్పు, స్వచ్భమైన నెయ్యి, బెల్లం తదితరాలతో ఈ ప్రసాదాన్ని తయారు చేయనున్నట్టు ఆలయ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హిమాన్షు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎప్పటి నుంచో మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా జొన్న, బజ్రా మరియు మొక్కజొన్న వంటి ముతక తృణధాన్యాలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడతున్నారు.