బాలీవుడ్లో ఇటీవలే విడుదలైనా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీస్తుంది. సినిమా విడుదలైనా రోజు నుంచి నేటీవరకు అనేకమంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా (84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే, వెంటనే ఉరి తీయండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నిజాయితీ గల న్యాయమూర్తి లేడంటే ఓ కమిటీని నియమించండి. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. ఆ ఘటనకు నేనే కారణామని నిరూపిస్తే, దేశంలో ఎక్కడైనా ఉరికంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు” అంటూ వెల్లడించారు.
అంతేకాకుండా ‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిది’ అని అన్నారు. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.