జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో, గ్రామాల్లో దారుణాలకు తెగబడుతున్న ఉగ్రవాదులు మరింత పేట్రేగారు. ఒక ఉగ్రవాదిని విడిపించడానికి ఆస్పత్రిపై దాడి చేసి పోలీసును పొట్టనబెట్టుకున్నారు. శ్రీనగర్‌లోని శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది.
పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాది నవీద్‌ను పోలీసులు సోమవారం చికిత్స కోసం ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులు జరిపారు. పోలీసులను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న నవీద్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నవీద్‌ను తప్పించడానికే ముష్కరులు దాడి చేశారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పోలీసుకు గాయాలయ్యాయి.