అదృష్టం ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందనేది ఎవరికీ తెలియదు. నిరుపేదను ఒక్క రాత్రిలో కోటీశ్వరుణ్ని చేసిన ఘటన జమ్మూకశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రూ.2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. రెండేళ్లుగా ‘డ్రీమ్ 11’లో క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ వంటి క్రీడా విభాగాల్లో బెట్టింగ్ పెడుతున్నాడు. శనివారం కూడా అదే తరహాలో బెట్టింగ్ పెట్టగా.. జాక్పాట్ తగిలింది. అతను ఎంచుకున్న జట్టు మొదటి స్థానంలో నిలిచింది.
శనివారం రాత్రి నిద్రలో ఉన్న తనకు ఫ్రెండ్ ఫోన్ ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పాడు వసీం. తాను సెలక్ట్ చేసుకున్న టీమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పడంతో ఒక్కసారి లేచి కూర్చోని ఆ డ్రీమ్ యాప్ చూడగా… రూ.2 కోట్లు గెల్చుకున్నట్లు మెసేజ్ వచ్చిందని చెప్పాడు. ఒక నిమిషం పాటు షాక్లో ఉన్నానని , అంతా కలలా అనిపించిందని చెప్పాడు. గెలుచుకున్న డబ్బుతో అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మెరుగైన వైద్యం చేయించే అవకాశం దక్కిందని తెలిపాడు.