Kashmiri, Bihari students clash in Moga after Pakistan lose T-20 World Cup match
mictv telugu

T20 ఫైనల్ పాక్ ఓటమి: కాశ్మీర్, బీహార్ విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ

November 14, 2022

ఆదివారం జరిగిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌.. ఓ కాలేజీలోని హాస్టల్ విద్యార్థుల గొడవకు కారణమైంది. పంజాబ్‌లోని లాలా లజపతిరాయ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌ కాలేజీ హాస్టల్‌లో నివసిస్తున్న బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల మధ్య మతపరమైన భీకర ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.

ఘల్లకలన్‌లోని లాలా లజపతిరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లోని ఫార్మసీ కళాశాల హాస్టల్‌ విద్యార్థులు అందరూ కలిసి నిన్న మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన వెంటనే హాస్టల్‌లో నివసిస్తున్న బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు పలు నినాదాలు చేశారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. పరస్పరం దుర్భాషలాడుతూ, కొట్టుకుంటూ, రాళ్లు రువ్వుకున్నారు.

ఈ ఘటనపై స్థానిక ఎస్‌హెచ్‌ఓ జస్వీందర్ సింగ్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. తాము హాస్టల్ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కనిపించిందని తెలిపారు. అయితే అక్కడ విద్యార్థులు ఎలాంటి నినాదాలూ చేసినట్టు తమకు వినబడలేదని చెప్పారు. ఈ ఘర్షణపై జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ జిల్లా ఎస్ఎస్పీతో మాట్లాడింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు మాట్లాడుతూ.. తాము భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని, పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే బీహార్ విద్యార్థులు ఇస్లాం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానిని ఆపాలని కోరినప్పుడు తమపై దాడి చేశారని పేర్కొన్నారని ‘జాగరణ్’ నివేదించింది.