దుబ్బాక ఎన్నికలు.. కత్తి కార్తీకకు హత్యా బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక ఎన్నికలు.. కత్తి కార్తీకకు హత్యా బెదిరింపులు

September 18, 2020

Kathi Karthika receives threats

బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకకు హత్యా బెదిరింపులు వచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దిగితే చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నీ సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని, లేదంటే సజీవ దహనం చేస్తామని దుండగులు హెచ్చరించారని కత్తి కార్తీక వెల్లడించారు. దుబ్బాక నుంచి కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా కార్తీక దుబ్బాకలో పర్యటిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న కార్తీకకు ప్రత్యర్థి వర్గాల నుంచి పరోక్షంగా బెదిరింపులు ఎదురవుతున్నాయి.

కార్తీక డ్రైవర్ షరీఫ్ ద్విచక్ర వాహనంపై గురువారం హైదరాబాద్ నుంచి దుబ్బాకకు వస్తుండగా.. రామాయంపేటలోని అడిగాస్ హోటల్ దగ్గర ఓ ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు డ్రైవర్‌ను అడ్డగించారు. ‘నువ్వు కత్తి కార్తీక డ్రైవర్‌వు కదా. కార్తీకతో పాటు నువ్వు కూడా అన్నీ సర్దుకొని హైదరాబాద్ పారిపోండి. లేదంటే సజీవదహనం చేస్తాం’ అని బెదిరించారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ బైక్ అక్కడే వదిలేసి పొలాల్లోకి పరుగెత్తాడు. కత్తి కార్తీకకు ఫోన్ చేసి చెప్పగా.. వెంటనే ఆమె బయలుదేరి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికల్లో గెలవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.