Kaushik Reddy said that he is the candidate of BRS MLA for Huzurabad
mictv telugu

‘హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే’

March 5, 2023

హుజూరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం ఉన్నదని చెప్పారు.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు కౌశిక్‌రెడ్డి. మంత్రి కేటీఆర్ హుజూరాబాద్లో పార్టీ అభ్యర్థిగా తన పేరును ఇప్పటికే ప్రకటించారని వివరించారు. ఇప్పటి నుంచే ఆ దిశగా పని చేయాలని సూచించారని తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విప్‌గా తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని.. ఈటల రాజేందర్ను ఇక ఇంటికి పంపిస్తానని వ్యాఖ్యానించారు. శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.