Kavi Samrat viswanatha Satyanarayana biopic lb sri ram as Telugu writer
mictv telugu

కవి సమ్రాట్‌.. మూవీ రివ్యూ

October 27, 2022

కొన్ని సినిమాలు వాణిజ్యపరంగా విజయం సాధిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆడకపోయినా అవార్డుల్ని వరిస్తాయి. మరికొన్ని సినిమాలుంటాయి. మనకెంత తెలీదో తెలియచెప్తూ, తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తాయి. అలాంటి చిత్రమే కవి సామ్రాట్‌. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. సవిత్ సి చంద్ర రాసి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ విడుదలకు ముందే స్పెషల్‌ షోల ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఓటీటీలోనూ విడుదలై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటోంది.

కోరిక కాదు.. సంకల్పం

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా తీయాలన్నది సవిత్‌ కోరిక కాదు.. సంకల్పం. అందుకే తెరమీద ఇంత బాగా వచ్చింది. భవిష్యత్‌ తరాలు విశ్వనాథ వారి గొప్పతనాన్ని దృశ్యరూపకంగా తెలుసుకునేలా ఓ మంచి ప్రయత్నం చేశాడు దర్శకుడు సవిత్‌. విశ్వనాథ సత్యనారాయణ జీవితంలోని ప్రధాన ఘట్టాల్నీ, ఆయన గొప్పతనాన్ని, సాహిత్యం మీద ఆయనకున్న గౌరవాన్ని చక్కగా పోట్రెయిట్ చేశారు. ‘వేయిపడగలు’ నవల, ‘రామాయణ కల్పవృక్షం’ కావ్యం లాంటి రచనల గురించి మనందరికీ తెలుసు. కానీ అవి రాయడానికి వెనకున్న కథనీ, ఇతివృత్తాన్ని చక్కగా చూయించారు.

కవి బయోపిక్‌లో అద్భుత మాటలు

వేల పద్యాలు రాసిన విశ్వనాథ బయోపిక్‌ లో రచయితగా సంభాషణలు రాసి మెప్పించడం అంతే అంత చిన్నవిషయమేమీ కాదు. కానీ సవిత్‌ చాలాచోట్ల తన పెన్నుతనం చూయించాడు. ”ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. జీవితం గురించి రాస్తున్న వాణ్ణి. ఈ మాత్రం జీవితాన్ని చూడకపోతే ఎలా?”, ”నీకైనా నాకైనా నా అన్నవాళ్లనిచ్చేది నాన్నే” లాంటి డైలాగులు చాలాకాలం పాటు గుర్తుండిపోతాయి.
రామజోగయ్యశాస్త్రి, నిర్మాత రాజ్‌ కందుకూరితోపాటు టీఎన్‌ఆర్ గారు కూడా ఓ పాత్రలో కనిపించడం విశేషం. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్‌, ఆర్ట్‌ వర్క అన్నీ బాగున్నాయి. చాలా తక్కువ బడ్జెట్‌ తో గంటకు పైగా నిడివున్న ఇలాంటి చిత్రాన్ని తీసి మెప్పించగలిగారంటే మామూలు విషయం కాదు. ఇక విశ్వనాథ పాత్రలో ఎల్బీ శ్రీరామ్‌ ఒదిగిపోయారు. నిర్మాతగా కూడా ఎక్కడా తగ్గకుండా నమ్మింది నచ్చేలా తీశారు. దర్శకుడిగా మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి కథని ఎంచుకుని సినిమాగా తీయడం అభినదించదగ్గ విషయం. తెలుగు మీద, సాహిత్యం మీద, సినిమా మీద గౌరవమున్న ప్రతి ఒక్కరూ చూడవల్సిన చిత్రం కవిసామ్రాట్‌.