కవిసంగమం కమనీయం ! - MicTv.in - Telugu News
mictv telugu

కవిసంగమం కమనీయం !

July 15, 2017

నువ్వొక పచ్చని చెట్టయితే, పిట్టలు వాటంతటవే వచ్చి వాలేను

జయహో కవిత్వం !

కవిత్వం వర్ధిల్లాలి !!

    – కవి యాకూబ్

కవిత్వం ఒక తియ్యని జలధార. అది ఒక మత్తు, మహత్యం, మహాద్భుతం.., గుండె లోతుల్లోంచి పెల్లుబికొచ్చే అక్షరాలు అలంకారాలౌతాయి. అలంకారాలైన ఆ అక్షర మాలలు పాఠకుల మెడలో హారాలౌతాయి. అలాంటి హారాల అల్లికలు చేసుకునే వేదిక ‘ కవి సంగమం ’ రవి గాంచని చోటు కవి గాంచును అన్నట్టే కవుల సంగమ దృష్టితో నడుస్తున్న ఈ కవిసంగమం అత్యంత విజయవంతంగా ముదుకు సాగుతోంది. ఇప్పుడొస్తున్న కాలంలో ఒక ఔట్ లెట్, రైట్ ప్లేస్.. కవిసంగమం గ్రూపే అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

కవిసంగమం

పచ్చని చిగుర్లేస్తున్న చెట్టు మీద కూర్చొని పాడితేనే కోయిల గానం కమ్మగా వున్నట్టనిపిస్తుంది. కవులు కూడా తమ కవితలను కవిసంగమంలో పోస్టు చేస్తేనే దానికొక అర్థం – పరమార్థం, బ్రాండ్ ఇమేజ్ వస్తుందని భావించవచ్చు. కవి సంగమం అనే పేరే ఎంత అందంగా ఆహ్లాదంగా వుంది కదూ. ఫేస్ బుక్కు వేదికగా కవి యాకూబ్ గారి దూర దృష్టిలోంచి పురుడు పోసుకున్న వండర్ మిలన్ కవి సంగమం. 5 వేల పైచిలుకు కవులు ఇందులో ప్రతిరోజూ తియ్య తియ్యని, కమ్మ కమ్మని కవిత్వం రాస్తుంటారు. వందల్లో కవితలు రోజూ పోస్ట్ అవుతుంటారయి. 2012 లో స్టార్టయిన ఈ వేదిక ద్వారా చాలా మంది కవులు వెలుగులోకి వచ్చారు. వస్తూనే వున్నారు. ప్రతిరోజూ ఒక శీర్షిక పేర కొందరు కవులు రాసే వ్యాసాలు సహా ఇంకా చదువుకోవడానికి చాలా మంది చాలా కవితలు రాస్తుంటారు. ఈ గ్రూపులోకి వెళితే మీతో అక్షరాలు ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తుంటాయి. ఎన్నెన్నో కవితలు మీలోని రసజ్ఞతను మేలుకొలుపుతాయి. ఇదొక స్టాండర్డ్ గ్రూపు. ఇక్కడ మన్నికైన కవిత్వం వెల్లు విరుస్తుంది.

కవిసంగమానికి స్ఫూర్తి

ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న కవి సంగమం అనేది చాలా మంది కొత్త కవులను వెలుగులోకి తీసుకువచ్చింది. దీనికి స్ఫూర్తి ఏంటి సర్ అని కవి యాకూబ్ ను అడిగితే చాలా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. వివిధ, దిన, వార, మాస పత్రికలు కవిత్వంను కపిత్వం అని కొట్టి పారేస్తూ కవిత్వాన్ని ఎంకరేజ్ చెయ్యలేకపోతున్నారు. కారణం కవిత్వం చదివేవాళ్ళు లేరని, అసలు కవిత్వమే రాసేవాళ్ళే లేరని వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసేస్కున్నారు. ఒక విధంగా తెలుగు కవిత్వానికి సమాధి కట్టే దిశలో వున్నప్పుడే అప్ డేటింగ్ ప్రాసెస్ లో వున్న ఫేస్ బుక్ వేదికగా ఒక కవిత్వపు గ్రూపు పెట్టుకొని బలహీనమౌతున్న కవిత్వానికి బలం చేకూర్చే దిశలోంచి పుట్టిన బృహత్తర వేదికే కవి సంగమం. చాలా మంది కొత్త కవులు పరిచయమౌతున్నారు. ఎంతో విరివిగా, విస్తృతంగా రాస్తున్నారు.

కొత్తగా రాసేవారికి ఇది చక్కని వేదిక. ఆల్ రెడీ రాస్తున్న కవులకు బోలెడంత స్పేస్ ఇస్తుంది ఈ గ్రూప్. ఈ సంవత్సరం ‘ మాటల మడుగు ’ అనే పుస్తకానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్న కవయిత్రి మెర్సీ మార్గరెట్ ఈ గ్రూప్ నుండి వచ్చిందే. కవిత్వం చచ్చిపోదు, పాతబడదు.., అదెప్పటికీ తాజాగా పరిమళిస్తూనే వుంటుంది. కవిత్వం చదివినవారికి గొప్ప ఫీల్ అనే అనే ఇంకొక రుచిని ఆస్వాదిస్తారు. ఆ రుచికి పాఠకులను దూరం చెయ్యాలని కొన్ని పత్రికలు నడుం కట్టాయి. ఆ తరుణంలో వచ్చిన కవిసంగమం పత్రికల కళ్ళు తెరిపించిందనే చెప్పాలి. పత్రికలు కవిత్వం మీద మళ్ళీ పున: గౌరవాన్ని ప్రతిష్ఠించుకున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.

అడ్మిన్స్@9

ఈ గ్రూపు స్టార్ట్ అయిన కొంత కాలానికే బిగ్ సక్సెస్ ను సొంతం చేస్కుంది. ఇన్ని వేల మంది కవుల కవితలను సరిచేస్తూ వారికి సరైన సూచనలిస్తూ గైడ్ చెయ్యటమనేది కత్తి మీద సాములాంటిది. అందుకే ఒక తొమ్మిది మంది సీనియర్, లబ్ద ప్రతిష్ఠులైన కవులు కలిసి కవిసంగమానికి నవగ్రహాలుగా ఏర్పడ్డారు. ఎప్పటికప్పుడు అప్ లోడ్ కవితలను పరిశీలిస్తారు. ఎక్కడైనా ఒక్క అక్షరం కూడా పొరపాటుగా దొర్లినా అది గమనించి ఆ కవికి సున్నితంగా వివరించి, సవరించి మెరుగైన కవిత్వాన్ని పాఠకులకు అందిస్తున్నారు. ఆ గ్రూపుకు నిత్యం చాలా మంది గ్రూప్ లో జాయినవుతామని రిక్వెస్టులు వస్తుంటాయి. అలా వచ్చిన వారి ప్రొఫైల్ ను చెక్ చేస్తారు ఈ తొమ్మండుగురు. అతని గోడ మీద అక్షరాలు ఏమైనా వున్నాయా అని. కొంత రాసినా పరవాలేదు. వాళ్లను సాదరంగా ఆక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి సలహాలిచ్చి వారిని కవిగా సాహితీ ప్రపంచానికి గిఫ్టుగా ఇస్తుంటారు.

ఎంత గొప్ప పని ఇది. ఒక లాంగ్ గుడ్ ప్రాసెస్. సమాజ చైతన్యంలో భాగం పంచుకునే కవులను పరిచయం చేయడం అనేది మామూలు విషయం కానేకాదు.

అడ్మిన్స్@9

1. కవి యాకూబ్

2. బూర్ల వెంకటేశ్వర్లు

3. వాహెద్

4. విరించి విరివింటి

5. అనిల్ డానీ

6. శ్రీనివాసు వాసుదేవ మూర్తి

7. యశస్వి సతీష్

8. కట్టా శ్రీనివాసు

9. రాజారాం తూముచర్ల

గ్రూపు రివాజు

ప్రతీ నెల రెండవ శనివారం ఒక మీటింగ్ పెడతారు. గోల్డెన్ త్రైషోల్డ్ అబిడ్స్ వేదికగా ఈ మీటింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని కవులు ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. శివారెడ్డి, నగ్నముని వంటి ఒక పెద్ద కవి, నడిమి కవితో ఇప్పుడొస్తున్న అభ్యుదయ కవితో కరచాలనం, ఆత్మీయ కలయిక వుంటుంది. వేదిక మీద తమ కవితలను చదివి వినిపిస్తారు. సీనియర్ కవులతో జూనియర్ కవులు ఇంటరాక్ట్ అవడం అనేది ఒక హెల్దీ ఆచారమనే చెప్పొచ్చు. బాగా రాసే కొత్త కవులను గుర్తించి వారికి సీనియర్ల చేత సభా ముఖంగా గౌరవ సన్మానం వుంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ పోయెట్రీ ఫెస్టివల్ పెట్టి ఇతర భాషా కవులను, ఆయా పత్రికల ఎడిటర్లను పిలిచి కవిత్వపు పండగను కన్నుల పండుగగా నిర్వహించడం అనేది కవిత్వానికి వారు చేస్తున్న వేడుక.
ఇలా ప్రతినెలా సదాచారంలా కొనసాగిస్తున్నారు. కొత్త కవులను ప్రోత్సహించడం వల్ల వారిలో ఉత్సాహం నిండి ఇంకా ఇంకా వారి కలాలకు పదును పెట్టుకునే అవకాశం లభించినట్టు అవుతుంది. అలాగే ఇందులో రాసిన కవుల కవితలన్నీ ఒక సంకలనంగా కూడా తీసుకువస్తారు. ఇందులో ప్రచురితమైన కవితలను నవుడూరి మూర్తి గారు ఆంగ్లంలోకి తర్జుమా చేసి పుస్తకంగా వెలువరించి మన తెలుగు కవుల ప్రఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

త్వరలో గ్రూపు అడ్మిన్ వాహెద్ గారు రాసిన ‘ మగ్దూం మొహియుద్దీన్ ’ పుస్తకం రానుంది. అలాగే సత్య శ్రీనివాస్ ‘ మట్టిగూడు ’ పర్యావరణ కవిత్వ పుస్తకాలు రానున్నాయి. దాదాపు 100 వారాల పాటు కవిసంగమంలో నవుడూరి మూర్తి గారు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు పుస్తక రూపంలో రానున్నాయి. ఇంకా చాలా మంది యువ కవులు కొత్త పుస్తకాలను వెలువరిస్తూ సాహిత్య లోకానికి కవిసంగమం సాక్షిగా ఎనలేని సేవ చేస్తున్నారు. కవుల్ని ప్రోత్సహించి మెరుగైన కవిత్వాన్ని ఈ సమాజానికి అందివ్వటమే రివాజుగా సాగుతోంది కవిసంగమం గ్రూపు.

‘కవిసంగమం బుక్స్ పబ్లికేషన్స్’ కవిసంగమం పుస్తకాలు కూడా ప్రచురించింది. 144 మంది కవుల కవిత్వం ‘కవిసంగమం 2012’పేరిట సతీష్ చందర్ గారి ముందుమాటతో వెలువరించింది. ఈ సంకలనంలో 80 మందికి పైగా కొత్తతరం కవుల కవితలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా ఎం. నారాయణ శర్మ 75 మంది కవులకవిత్వంపై చేసిన విశ్లేషణలు ‘ఈనాటి కవిత’పేరిట వెలువడింది. వాహెద్ రచన ‘ సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్’కూడా ప్రచురించింది.
ఇవి ఈ కవిత్వ గ్రూపులో కాలమ్స్ గా వారం వారం వెలువడినవే.
అలాగే ఎన్. వేణుగోపాల్ పుస్తకం ‘కవిత్వంతో నా ములాఖాత్’కూడా రచయిత ప్రచురణగా వచ్చింది.

 

కవి యాకూబ్

కవి యాకూబ్.. ఈ పేరు సాహితీ వనంలో ఒక పరిమళం.. కవిత్వంలో విప్లవం.. కవిత్వానికి ఈ సమాజాన్ని బంధువులను చెయ్యాలని తపించే నిత్య కృషీవలుడు. నిత్యం కవిత్వం గురించే దిగులు చెందే సున్నిత మనస్తత్వం గలవాడు. ఫేస్ బుక్ అంతగా ప్రాబల్యంలో లేని రోజుల్లో చాలా మంది బ్లాగుల్లో రాసుకునేవాళ్ళు. అలాంటిది నెమ్మదిగా ఫేస్ బుక్ కు రాతలు కన్ వర్ట్ అవడం అనేది ఒక విప్లవం అనే చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా రొట్టమాకురేవు గ్రామంలో జన్మించారు. ఎంఏ తెలుగు, ఎమ్ ఫిల్, పిహెచ్ డి చేసారు. లెక్చరర్ గా పాఠాలు చెప్తూనే యువ కవులకు కవితా పాఠాలు కూడా చెప్తున్నారు. కవిగా తన బాధ్యతను ఎరిగిన కవి గనక కవిత్వాన్ని ఇంకా విస్తృతం చెయ్యాలనే సంకల్పంలోంచి పుట్టిన మహా గొప్ప ఐడియా కవి సంగమం. తన వంతుగా ఎంతో మంది కవులకు వేదికయ్యారు యాకూబ్. ఈ గ్రూపు స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో 2012, 13, 14 వరకు నిత్యం 24 గంటలు ఫేస్ బుక్ కవిసంగమం గ్రూప్ లో చాలా బిజీగా గడిపేవారట. ఎందుకంటే అప్ లోడ్ అయ్యే ప్రతీ కవితను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి తగు సూచనలిస్తూ కవిత్వ సేవలో తరించేవారట. ‘ జయహో కవిత్వం ’ అనే సిద్ధాంతాన్ని నమ్మి కవిత్వానికి సలాములు చేస్తున్న ఈయన నిజంగా మనసున్న కవి. ప్రముఖ కవయిత్రి శిలాలోలిత వారి సతీమణి.

35 ఏళ్ళ క్రితం హైదరాబాదు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రతీ సంవత్సరం ముగ్గురు కవులకు ‘ షేక్ మహ్మద్ మియా, కె యల్. నరసింహా రావు, పురిటిపాటి రామిరెడ్డి రొట్టమాకు రేవు స్మారక అవార్డు ’ ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఇలా కవిసంగమం గ్రూపును గ్రేట్ సక్సెస్ చేసిన కవి యాకూబ్ హార్ట్ ఫుల్ గా ప్రశంసనీయులే !

  • సంఘీర్