ఓ సామాన్యుడి కథ.. కవి యాకూబ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓ సామాన్యుడి కథ.. కవి యాకూబ్

February 17, 2018

ఇతని పేరు ఆదెర్ల శంకర్. కారేపల్లి ( సింగరేణి ) ఊరు. అక్కడే పుట్టాడు. అక్కడే పెరిగాడు. అక్కడే ఉన్నాడు. చదువు అంతా అక్కడే. డిగ్రీ చదువుకున్నాడు. SC సామాజికవర్గంలో పుట్టాడు. చిన్నప్పటినుంచి పాటలు పాడుతూనే ఉన్నాడు. కంజీర కొడతాడు. సభల్లో కాలికి గజ్జెకడతాడు. కాసెపోసి పంచెకడతాడు. భుజమ్మీద గొంగళి. గద్దరన్నలాంటి ఆహార్యం అన్నమాట. ఎక్కడ ఆ చుట్టుపక్కల పాట అవసరమున్న, ఏ కార్యక్రమమైనా సిద్ధం. స్వయంగా ఆ సందర్భానికి అనుగుణమైన పాట తనే రాస్తాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన, పోలీసు కార్యక్రమాలపైన, సర్వశిక్ష అభియాన్, పోలియో చుక్కలు, హరితహారం, చెరువు, వ్యవసాయం… ఇలా ఏ కార్యక్రమమైనా శంకర్ పాటతో రెడీ. కంజీరతో ఆ కార్యక్రమం దగ్గర సిద్ధం.

కారేపల్లి ప్రాంతంలో అందరూ గుర్తుపట్టే పాటగాడు. తొలిరోజుల్లో ఇళ్లకు పెయింటింగ్ చేసే పని, బోర్డులు రాసే పనులతో జీవితం మొదలుపెట్టాడు. అవేనా – పొట్టకూటికోసం అన్ని పనులూ చేసాడు.

ఇప్పుడు ఇతడేం చేస్తున్నాడు?

తెలంగాణ ఉద్యమం మొదలైన రోజుల్లోనే బస్టాండ్ సెంటర్లో చిన్న టీబండి ‘తెలంగాణ టీ స్టాల్’ పేరుతో మొదలుపెట్టాడు. కిరోసిన్ స్టవ్, టీ పాత్ర, ఒక ప్లాస్క్ – అదే అతడి పెట్టుబడి. అతని ముఖమ్మీది చిరునవ్వు అదనపు పెట్టుబడి. టీ చేయడం, ప్లాస్క్ నింపుకోవడం, పేపర్ కప్పులు తగిలించుకుని అక్కడనుండి బయల్దేరడం. షాపుల దగ్గర, బస్టాండ్ దగ్గర, ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, బాంక్ దగ్గర మొబైల్ టీ సెంటర్ లాగా తిరిగి అమ్మడం. ఇదీ ఇతని పని. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం ఇతని హాబీ.

అంతేనా, ఇంకా ఉంది. ఎప్పుడూ తన బండికి HIV గురించిన స్లోగన్ రాసిన బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ ను కలిసినవారికి చూపడం, ఆ విశేషాల్ని చెప్పడం.

” ఎయిడ్స్ అంతం, శంకర్ పంతం ” అవేర్నెస్ ప్రోగ్రాం అన్నమాట. ఇదంతా ఎందుకు అని అడిగితే, ” చెప్పాలన్నా! ఇదెంత ప్రమాదకరమో తెలియజెప్పాలి ” అంటాడు.

నేను రొట్టమాకురేవు వెళ్లినప్పుడల్లా తప్పక కలుస్తాడు. మా ఊరికొస్తాడు. నేను లేకపోయినా మా అమ్మను చూసి రావడానికి వెళ్తాడు. లైబ్రరీలో పుస్తకాలు చూస్తాడు. కొంచెంసేపు కూచుని చదువుకుంటాడు. అక్కడ్నుంచి ఫోన్ చేస్తాడు. క్షేమాలు చెబుతాడు.

తన ప్రతి ఫోన్‌లో ఇటీవలి తన కార్యక్రమాల గురించి చెబుతాడు. రాసిన పాటను విన్పిస్తాడు. తన పాటలు పుస్తకంగా తేవాలని ప్రయత్నం. ” సభ కారేపల్లి బస్టాండ్ సెంటర్లో చేయాలన్నా! పెద్ద పెద్దోళ్లని పిలవాలె ” ఇది అతని కల.

ఇంకోమాట కూడా ఉంది. తెలంగాణ కళాసారధి కళాకారుల్లో తను కూడా ఎంపిక అవ్వాలని ఇతని కోరిక. జిల్లాలో ఎవరెవరికి వచ్చాయో, తనెందుకు రిజెక్ట్ అయ్యాడో ఏకరువు పెడుతుంటాడు. తాను ఎంపికయితే జీవితానికి కనీసభద్రత ఉంటుందని అతని ఆశ. అందుకోసం కలిసిన ప్రతి అధికారికి, ఎమ్మెల్యేకు, ప్రభుత్వ బాధ్యుడికి ఒక అప్లికేషన్ రాసి ఇస్తుంటాడు. అతని కల నెరవేరేనా? ఇదో జీవితమంతటి పెద్ద ప్రశ్న ? నెరవేరాలి. ఆదెర్ల శంకర్ లాంటివాళ్ల కలలు నెరవేరకపోతే, మనలో ఈ వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. అతని కలలు జయించాలి.?

ఆదెర్ల శంకర్ ఫోన్ నెం : 9966751865