సల్వార్ కమీజ్ మల్లయోధురాలు! - MicTv.in - Telugu News
mictv telugu

సల్వార్ కమీజ్ మల్లయోధురాలు!

September 5, 2017

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్(WWE) పోటీల మనం టీవీల్లో చాలాసార్లు చూస్తుంటాం.  అందులో  కొట్టుకునే వారు ఎలా ఉంటారు?  ఓవైపు బాహుబలికి డబుల్ ఉంటే… ఇంకో వైపు బల్లాలదేవకు డబుల్ పర్సనాల్టీతో ఉంటారు. ఒక్కొక్కర్ని చూస్తుంటే ..వామ్మో  వీళ్లేం తింటార్రా బాబు ఇంతున్నరు అని అనిపిస్తుంది. ఆ పోటీలో పాల్గొనే  ఆడవాళ్లు కూడా  చాలా దృఢంగా ఉంటారు. అయితే  ఆ WWE  మహిళల విభాగంలో  మొట్ట మొదటిసారి  మనదేశంనుంచి  కవితాదేవి ఎంపికైంది. ఆమె భారతీయ సంప్రదాయ సల్వార్ కమీజ్ లో  న్యూజీలాండ్ కు చెందిన  ప్రత్యర్ధిని ఎదుర్కొంటున్న  వీడియో  ఇపుడు వైరల్ అయ్యింది. ఆ పోటీలో  తాను గెలవలేదు కానీ  సల్వార్ కమీజ్ లో ప్రత్యర్ధికి బలమైన పోటీ ఇస్తూ  చూస్తున్న అందరి దృష్టిని తన వైపు, భారత్ వైపు మర్లేలా చేసింది.

ఎవరీ కవితా దేవి…!

కవితా దేవిది హర్యానా రాష్ట్రంలోని  జులానా  అనే చిన్న ఊరు.  ఆడపిల్లల పట్ల విపరీతమైన వివక్ష ఉన్న రాష్ట్రం నుంచి ఆమె ఈ పోటీలకు ఎంపిక కావడం విశేషం. పదోతరగతికి మించి అమ్మాయిలు చదవకూడదనే పరిస్థితులు ఉన్న ఊళ్లో బిఎ డిగ్రీ వరకు చదివిందామె. ఉన్నత చదువులు చదివేందుకు, వెయిట్‌ లిఫ్టర్‌గా మారేందుకు ఆమె అన్నయ్య సందీప్‌ దలాల్‌  చాలా ప్రోత్సహించాడట. స్పోర్ట్స్‌ కోటాలో సహస్త్ర సీమాబల్‌(ఎస్ఎస్ బి)లో కానిస్టేబుల్‌గా చేరింది. ఆ తరువాత స్పోర్ట్స్‌లో కెరీర్‌ బాగుండాలని 2010లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తుండగా టోర్నమెంటుల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో రష్యాలో జరిగిన పోటీలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సివచ్చిందట.

సాధించిన విజయాలు…!

కవితా దేవీ వెయిట్‌లిఫ్టింగ్‌లో, మిక్స్డ్ డమార్షల్‌ ఆర్ట్స్‌లో జాతీయ చాంపియన్‌ . 2007లో పలుసార్లు నేషనల్‌ సీనియర్‌ వెయిట్ లిఫ్టింగ్‌  చాంపియన్‌గా నిలిచింది. 2016లో జరిగిన దక్షిణాసియా  గేమ్స్‌లో 75 కేజీల కేటగిరీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచంలోనే ‘‘మొదటిసారి మహిళలకోసం ఏర్పాటుచేసిన డబ్ల్యుడబ్ల్యుఇ పోటీల్లో మన దేశం నుంచి  ఎంపైకైంది.

అమీర్ ఖాన్  తీసిన దంగల్ సినిమా చూసి  మనదేశంలో  చాలామంది ఆడవాళ్లు కుస్తీలు పడుతూ రెజర్లు కావాలనుకున్నారు. ఆ సినిమా చాలామందికి స్పూర్తినిచ్చింది.  మరి నిజజీవితంలో చిన్న గ్రామంలో పుట్టి  ఈ స్థాయికి ఎదిగిన కవితాదేవి ని చూసి  మరింత మంది ఆడవాళ్లు స్పూర్తి  పొంది ఆమెను  ఆదర్శంగా తీసుకోవాలి.  కవితాదేవీ  రెజ్లింగ్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.