ధాన్యం సేకరణపై ట్వీట్ల యుద్ధం.. రాహుల్ గాంధీకి కవిత కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

ధాన్యం సేకరణపై ట్వీట్ల యుద్ధం.. రాహుల్ గాంధీకి కవిత కౌంటర్

March 29, 2022

rahul

తెలంగాణలో వరి ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఉగాది తర్వాత నేరుగా కొట్లాడుతామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈలోగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కేంద్రం తెలంగాణ నుంచి ప్రతీ గింజను కొనాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. ఈ విషయంలో తెలంగాణకు అండగా ఉంటానని పేర్కొన్నారు. రాహుల్ ట్వీట్‌కు కవిత బదులిచ్చారు. ‘మీరు మాటలు చెప్పడం కాదు. చేతల్లో చూపండి. ప్రతీరోజూ టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే మా ఎంపీలతో కలిసి వెల్‌లోకి రండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతా’రంటూ వ్యాఖ్యానించారు. కవిత ఇచ్చిన జవాబుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు సభలో పోరాటం చేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. 2021 ఆగస్టులో ఎఫ్‌సీఐ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం సంతకం చేయలేదా? అంటూ నిలదీశారు. రైతులకు అన్యాయం చేసింది కేసీఆరే అన్న సంగతి గుర్తించుకోవాలని రిటర్న్ కౌంటరిచ్చారు.