రామాయణం పుట్టిందే తెలంగాణలో - MicTv.in - Telugu News
mictv telugu

రామాయణం పుట్టిందే తెలంగాణలో

December 4, 2017

రామాయణం పుట్టిందే తెలంగాణలోనన్నారు నిజామాబాద్ ఎం.పి. కల్వకుంట్ల కవిత. సోమవారం జగిత్యాల లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహకాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ తెలుగులో ఉద్గ్రంథాలు అని చెప్పబడే రామాయణం, మహాభారతం, భాగవతం ఎన్నో సంవత్సరాల క్రితమే తెలంగాణ నేలపై ఆవిష్కరించబడ్డాయని చెప్పారు.  మహాభారతాన్ని తిక్కన ఎక్కడో రాసినప్పటికీ ప్రతాప రుద్రుడి కొలువు లో ఆవిష్కరించారని తెలిపారు. వాల్మీకి సంస్కృతంలో రామాయణం రాస్తే మన తెలంగాణ బిడ్డలు రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం రాశారని కవిత వివరించారు.

 పోతన రాసిన  భాగవతాన్ని ఇంటింటా పాడుకునే పరిస్థితి ఉందన్నారు. ఇంత ఘనమైన చరిత్ర మనది.. మన చరిత్రను మనం చెప్పుకునే పరిస్థితి గతంలో లేదనీ,  గత పాలకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ను తక్కువ చేశారన్నారు.  తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన  కవులు, రచయితలను మరుగున పడేశారని కవిత ఆవేదన వ్యక్తం చేస్తూ, మనది వెనకబడిన జాతి కాదని, వెనకకు నెట్టేయ బడిన వారమన్నారు. పోతనామాత్యుడు అంత అద్భుతంగా భాగవతం రాస్తే ఆయనది బమ్మెర కాదనే ప్రయత్నం చేశారన్నారు. 60 ఏళ్లుగా ఆవేశాన్ని పిడికిలిలో పట్టుకొని ఉద్యమం చేశామని తెలిపారు. తెలంగాణ అస్తిత్వ పోరాటం మాదిరిగానే తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కవిత చెప్పారు. దీన్ని గుర్తు చేసుకునేందుకే ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మహాసభలు  ప్రారంభించడానికి రాష్ట్రపతి, ముగింపుకు ఉపరాష్ట్రపతి వస్తారని కవిత తెలిపారు

తొలి తెలుగు పదం  నాగొబు అమరావతిలో ఉందని చెప్పారనీ, వాస్తవానికి  తొలి తెలుగు పదం జగిత్యాల జిల్లా కోటిలింగాల శాసనంలో ఉందని, శాతవాహన రాజుల కరెన్సీ నాణేలపై  తెలుగు పదాలు ఉన్నాయని తెలిపారు. కోటిలింగాలను పిల్లలకు చూపిస్తే వారికి అవగాహన కూడా వస్తుందన్నారు.తెలుగును మర్చి పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ 1-12తరగతుల వరకు తెలుగును నేర్పిస్తున్నారని కవిత చెప్పారు.

తెలంగాణ యాస, భాషను ను మనం మర్చిపోలేదు. అలాగే ముందు తరం రాసే విధంగా, చదివే విధంగా తెలుగు సాహిత్య ప్రక్రియ గొప్పదనాన్ని చాటాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

తెలుగుకు ప్రాచీన హోదాను తెలంగాణ వచ్చాక కొట్లాడి సాధించుకున్నామని చెప్పారు. తెలుగు వెలగాలని ఎంపి కల్వకుంట్ల కవిత ఆకాక్షించారు.