విపక్షాలను ఘాటు విమర్శలతో ఉక్కరిబిక్కిరి చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ వారికిప్పుడు చక్కని స్నేహితుడిగా మారిపోయారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో ఆయన చక్కని ఉపాధ్యాయుడిలా వవ్యవహరించారు. సభ నిర్వహణపై పాఠాలు చెప్పారు. మంచిమాటలు, వివరణలు, విశ్లేషణలతో విపక్షాల మనసు దోచుకున్నారు.
మరికొన్ని అంశాలపైనా చర్చిద్దాం..
అసెంబ్లీలో సభ్యులందరికి, ముఖ్యంగా అన్నిరాజకీయ పార్టీల నాయకులకు సమస్యలను ప్రస్తావించే అవకాశం ఎక్కువగా రావడానికి ముఖ్యమంత్రే స్వయంగా చొరవ చూపి కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అడిగిన ప్రతి అంశంపై చర్చకు సంసిద్ధత వ్యక్తం చేసిన సీఎం మరిన్ని అంశాలపై కూడా చర్చిద్దామని ప్రతిపాదించారు. కాంగ్రెస్, ఇతర పక్షాలన్ని కలిపి దాదాపు 20 అంశాలను చర్చకు ప్రతిపాదించారు. ఇతర పక్షాలు లేవనెత్తిన అంశాలన్నింటిపై సంసిద్ధత వ్యక్తం చేసిన కేసీఆర్ మరికొన్ని అంశాలు జోడించిన కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశాన్ని ఎజెండాలో చేర్చాలని ముఖ్యమంత్రి డిప్యూటి స్పీకర్‌కు సూచించారు.
ఎన్నిరోజులైనా ఓకే..
సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి మాత్రం అన్ని అంశాలు చర్చించడానికి 50 రోజుల పాటు సభను నడపాలని ప్రతిపాదించారు. అంతకన్న ఎక్కువ రోజులైనా అధికార పక్షం తరపున తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఏ అంశంపై చర్చకైనా, ఎన్ని రోజులు సభ నడపాడానికైనా తాము సిద్దమని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడంతో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డితో పాటు ఇతర పక్షాల సభ్యులెవరూ మారు మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే సభ నడపడానికి సహకరిస్తామన్నారు. ప్రతిపక్షాలు కోరకున్నా ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధానాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
కొత్త విధానం..
‘‘ప్రశ్నోత్తరాల నిర్వహణలో మార్పులు చేయాల్సిన అవసరం వుంది. అందరు సభ్యులకు, అన్ని ప్రశ్నలకు అవకాశం రావడం లేదు. ఇది సరైన విధానం కాదు. అసెంబ్లీలో ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టడం సభ్యుల ప్రాథమిక హక్కు. సమయం సరిపోకపోవడంతో అన్ని ప్రశ్నలు ప్రస్తావనకు రావడం లేదు. కాబట్టి దీనికోపద్ధతి పెట్టకుందాం. ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకోవాలి. ఒక్కో ప్రశ్నకు 9 నిమిషాల సమయం కేటాయించాలి. 9వ నిమిషం తరువాత మరో ప్రశ్నకు కచ్చితంగా వెళ్లిపోవాలి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతీ ప్రశ్నకు అనుబంధ ప్రశ్నలు వేసే హక్కు సిగ్నేటరీ కాకున్నప్పటికీ అందరు నాయకులకు అవకాశం ఇవ్వాలి. ఏదైనా ప్రశ్న ముఖ్యమైనదనుకుంటే ప్రశ్నోత్తరాల సమయం తరువాత అదే ప్రశ్నపై స్పీకర్ అనుమతితో పూర్తి స్థాయి చర్చ జరగాలి. ఉదయం 10 నుండి 11.30 వరకు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించాలి. మొదటి 45 నిమిషాలు అనుబంధ ప్రశ్నలకు ఉదారంగానే అనుమతి ఇవ్వాలి. రెండవ అర్ధ భాగంలో మాత్రం ఒకే ఒక్క అనుబంధ ప్రశ్నకు అవకాశం కల్పించాలి. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత సభ్యులకు జీరో అవర్ కింద తమ ప్రాంత సమస్యలు చెప్పే అవకాశం కల్పించాలి. దాని తరువాత సభలోనే సభ్యులు ప్రభుత్వానికి పిటీషన్లు సమర్పించే పద్ధతి కొత్తగా ప్రవేశపెట్టాలి. జీరో అవర్‌లో కాని, ప్రశ్నోత్తరాల సమయంలో కాని, మరే సందర్భంలో కాని ప్రభుత్వం అప్పటికప్పుడు సమాధానం చెప్పలేకపోతే తరువాతనైనా సభ్యులకు మంత్రులు లిఖిత పూర్వక సమాధానం విధిగా పంపాలి. ప్రతీ బిల్లుపై కూలంకశంగా చర్చ జరగాలి. సభ్యులు చేసే సూచనలకు అనుగుణంగా బిల్లులో అవసరమైతే మార్పులు చేయడానికి కూడా మేము సిద్ధంగా వున్నాము. మాకెలాంటి భేషజాలు లేవు’’ అని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు అన్ని రాజకీయ పార్టీలు హర్షామోదాలు తెలిపాయి. ప్రతిపక్షాలకు ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువగా కల్పించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. తాము అడిగిన దాని కన్నా ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించడంతో బిఎసి సమావేశంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వం ముందుంచడానికి ఏ డిమాండ్ దొరకని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమస్యలను వాయిదా తీర్మానాల ద్వారా చర్చకు అనుమతించాలన్న ప్రతిపక్ష నాయకుడి విజ్ఞప్తిని కూడా బిఎసి ఆమోదించింది. ప్రశ్నోత్తరాల తరువాత వాయిదా తీర్మానాలను పరిశీలించడానికి డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు.
హందాగా ఉంటుందన్న సంకేతం ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ గౌరవంగా హుందాగా జరుగుతున్నదన్న సంకేతం యావత్ దేశానికి అందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆసెంబ్లీ నిర్వహణ తీరును తాను, జానారెడ్డి, ఇతర సీనియర్ సభ్యులు చూసామన్నారు. అప్పుడు చాలా తక్కువ రోజులు సభ నిర్వహించే వారని, అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించడానికి సభ్యులకు అవకాశమే రాకపోయేదని, నామమాత్రంగా సభ నిర్వహించి అధికార పక్షం దులుపుకునిపోయేదని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఏ అంశంపైనానా, ఎన్నిరోజులైనా చర్చిస్తున్నామన్నారు. సభ జరిగే దినాలు ఎక్కువగా వుంటెనే ప్రజలకు ఎక్కువ ప్రయోజనమని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాలను ప్రతిపక్ష నాయకులు అంగీకరించారు.
ముట్టడి సరికారదు
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వున్నప్పటికీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం సరైంది కాదని జానారెడ్డితో సీఎం అన్నారు. ప్రాణాలు పోయినా అసెంబ్లీ ముట్టడి ఆగదని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడాన్ని సిఎం తప్పు బట్టారు. ఎవరి ప్రాణాలైనా ఎందుకు పోవాలి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పధ్ధతిలో ప్రభుత్వం దృష్టికి సమస్యలను తెచ్చే వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు. సభలో కూడా ఏ సమస్యపైనైనా చర్చించడానికి సిద్ధమని, అదే సమయంలో గొడవ చేసి అరాచకం చేద్దామంటే తాము కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ బీఎసీ సమావేశం తరువాత ముఖ్యమంత్రి శాసన మండలి బీఏసీలో కూడా పాల్గొన్నారు. అక్కడ కూడా దాదాపు ఇవే అంశాలను వెల్లడించారు.