24 గంటల కరెంటుతో రైతులకు మేలు కాదు కీడు.. - MicTv.in - Telugu News
mictv telugu

24 గంటల కరెంటుతో రైతులకు మేలు కాదు కీడు..

December 12, 2017

వ్యవసాయానికి రోజుకు 24 గంటలూ  కరెంటు ఇవ్వడం వల్ల రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్న అభిప్రాయాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి, రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుందని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.  

‘ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే, కొండ నాలుకకు మందేయబోతే ఉన్న నాలుక ఊడిందనే సామెత వ్యవసాయ కరెంటు విషయంలో నిజమయ్యే ప్రమాదం ఉంది.. రైతులు నూటికి నూరు శాతం ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల లాభం కలుగుతుంది.  లేనట్లయితే భూగర్భ జలాలు అడుగంటుకుపోయి పంట పొట్టకొచ్చిన సమయంలో కరెంటు ఉన్నా, నీళ్లు లేక పంటలు ఎండిపోయి నష్టపోయే దుస్థితి వస్తుంది..’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే రైతుల మేలు కోసమే 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించుకున్నందువల్ల, రైతులు తమను తాము దెబ్బతీసుకునేలా వ్యవహరించరనే నమ్మకం తనకుందన్నారు. ఆటో స్టార్టర్ల వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెబితే  రైతులు అర్థం చేసుకుంటారని, స్వచ్ఛందంగా  ఆటో స్టార్టర్లు తొలగించుకుని సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు నచ్చచెప్పడం కోసం వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సభలు నిర్వహించాలని కోరారు.  

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించేందుకు కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు జి.జగదీష్ రెడ్డి, టి.హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్ కో-ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు  తదితరులు పాల్గొన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల కలిగే లాభ నష్టాలను, ఎదురయ్యే సవాళ్లను ఈ సమావేశంలో కూలంకశంగా చర్చించారు.

24 గంటల సరఫరా ఇవ్వడం వల్ల ఆటోస్టార్టర్ల వల్ల 24 గంటల పాటు బోర్లు పోస్తాయన్నారు. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చే నాటికి భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి వస్తుందని అధికారులు వివరించారు.

కరెంటు అందుబాటులో ఉన్నా, భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుందని వివరించారు. గ్రామాల్లో రైతుల నుంచి తమకు ఈ రెండు విషయాల్లోనే ఫిర్యాదులు, అభ్యంతరాలు వస్తున్నాయని వెల్లడించారు. ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే, చివరికి 24 గంటల కరెంటు సరఫరా ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వ్యవసాయానికి 24 గంటల సరఫరా కార్యక్రమం వల్ల రైతులు పూర్తి స్థాయిలో లబ్ది పొందే వ్యూహం ఖరారు చేసి అమలు చేయాలన్నారు. ఆటోస్టార్టర్లను తొలగించుకోవడంతో పాటు అవసరం మేరకు మోటార్లతో నీరు తోడుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. డిసెంబర్ 31 రాత్రి 12:01 గంటల నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించాలని సీఎం ఇది వరకే విద్యుత్ శాఖను ఆదేశించారు.

విద్యుత్ శాఖ కూడా రూ.12వేల కోట్లకు పైగా వ్యయం చేసి పంపిణీ, సరఫరా వ్యవస్థలన మెరుగుపరిచి, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి  సిద్ధమయింది. కాగా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కావడం వల్ల కలిగే భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం  విద్యుత్ సంస్థలకు హామీ ఇచ్చారు.