నైరుతి రుతుపవనాలతో కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల జలమయం కాగా, పలు చోట్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలకు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే పలు జిల్లాలలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కోరింది.