తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించారు. సోమవారం ఏపీకి చెందిన పలువురు నేతలు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ని ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత ఏపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరతామని చెప్పారని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం ప్రైవేటీకరణ అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన అన్ని రంగాలను తిరిగి జాతీయీకరణ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కును కూడా ప్రస్తావించారు. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు కిక్కిరిసి పోతుందని జోస్యం చెప్పారు. ఇక రావెల్ కిశోర్ బాబును ఢిల్లీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, దేశవ్యాప్తంగా దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.