తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవలే భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు పార్టీ పేరును మార్చారు. ఇప్పటికే దేశ రాజధానిలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. అంతేగాక, పార్టీకి ఓ సొంత విమానం కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానం కొనుగోలు చేసింది ప్రభుత్వ సొమ్ముతో కాదని, పార్టీకి చందాల రూపంలో వచ్చిన డబ్బుతో కొన్నామని పార్టీ శ్రేణులు తెలిపాయి కూడా. విమానం కొనేంతలా ఆ పార్టీకి వచ్చిన చందాలు ఎన్ని కోట్లు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు. అయితే ఆ లెక్క తేలింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఆదాయం ఒక్క ఏడాదిలోనే 5 రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. గతేడాది మార్చి 31 నాటికి రూ. 37.65 కోట్లుగా ఉన్న బీఆర్ఎస్ ఆదాయం ఏడాది తిరిగే సరికి రూ. 218.11 కోట్లు అయింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 31నాటికి తమ ఆదాయ లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది బీఆర్ఎస్. ఈ ఏడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో పేర్కొంది.
తాజా నివేదిక ప్రకారం.. గత ఏడాది మార్చి నాటికి ఇతర ఆదాయం ద్వారా రూ.16.21 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.16.12 కోట్లు వచ్చాయి. ఇక, నికర ఆదాయం, ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్ మొత్తం కలిపి బీఆర్ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ రూ.480 కోట్లకు చేరింది. బీఆర్ఎస్ ఆదాయం భారీగా పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి :