3+3 = 1 - MicTv.in - Telugu News
mictv telugu

3+3 = 1

July 5, 2017

ఏడా కుదర లేదు… కుదుర్చుకోవడానికీ వీలు కాలేదు. ఈడ మాత్రం పొత్తు బాగా కుదిరినట్లే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే సీన్. రాష్ట్రపతి ఎన్నికల్లో  బిజెపి అభ్యర్థికి అధికార,  విపక్షాలు ఏపీలో పోటీ పడి మద్దతునిచ్చాయి. అందరూ ఢీల్లీ వెళ్లారు. అక్కడి వారికి తామున్నమనే అభయం  ఇచ్చి వచ్చారు.

తెలంగాణలో కూడా అధికార  టిఆర్ఎస్ భేషరతుగా  కమలానికే మద్దతని చెప్పింది. రెండు రాష్ర్టాలను రాష్ట్రపతి అభ్యర్థులు మీరా కుమార్, కోవింద్ లు చుట్టేశారు. మూడు ప్రధాన పార్టీలు  ముచ్చటగా కమల దళానికి జే కొట్టాయి.

అవసరం… అనివార్యత… భవిష్యత్తు ఈ మూడు కలిపి… మూడు పార్టీలను ఏక తాటి మీదికొ తీసుకొచ్చాయనే టాక్ బాగా నడుస్తున్నది. అసెంబ్లీలో బాబు మాట్లాడిందానికి అడ్డం తగిలే  జగన్ బాబు… అభ్యర్థికి మద్దతు విషయంలో మౌనం దాల్చారు… ఎందుకు ఎమిటీ అనే ప్రశ్నకు తావే లేకుండా మద్దతిచ్చారు. చంద్రబాబు నాయుడు  ఆయన పరివారం ఎవ్వరూ జగన్ మద్దుతు ఇవ్వడాన్ని తప్పు పట్ట లేదు. అవినీతి పరుని పార్టీ మద్దతు మీకెందుకనే ప్రశ్న బిజెపికీ వేయలేదు. ఎందుకంటే వీలు చిక్కినప్పుడల్లా నీతి నిజాయితీ అని జగన్ పై విరుచుకుపడే  సైకిల్ పార్టీ నాయకులు కూడా మౌన మునులయ్యారు. వీళ్లూ జగన్ నిర్ణయానికే సై అన్నట్లుంది.

దీంట్ల ఎవరి ప్రయోజనాలు ఏమిటో తెలియదు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసమే  ఇట్లా చేశారో… మోడీ ప్రాపకం కోసం చేశారో తెలియదు. కాకా పోతే మూడు పార్టీలు ముక్త కంఠంతో  ఎన్డీఏ  అనగానే ఎగిరి గంతేశారనేది మాత్రం నిజం. టిడిపి అంటే ముందు నుండీ  ఎన్డీఎతోనే ఉంది. ఏ కూటమిలో లేని  ఎపి ప్రతిపక్షం పార్టీ, తెలంగాణ అధికార పక్ష పార్టీ  ఎందుకు మద్దతునిచ్చాయో మరి.

సాధారణ ఎన్నికలను తలపిస్తున్న రాష్ట్రపతి ఎన్నికల సీన్ లో మన వారు కూడా తమ వంతు పాత్ర పోషిస్తారని అనుకున్నారు. అయితే ఎలాంటి హంగామా లేకుండా  కామ్ గా పనికానిచ్చారు. మోడీకీ జై కొట్టారు. అటు ఎపిలో… ఇటు తెలంగాణలో కాంగ్రెస్  పార్టీ లెఫ్ట్ వారి మద్దతు తీసుకుని ఆ విధంగా ముందుకెళ్తున్నది.

కొన్ని సార్లు రాజకీయాలు… పార్టీల నిర్ణయాలు చిత్రంగనే కాదు…  అయోమయంగాఉన్నట్లు కన్పిస్తవి. అంతిమంగా ఏం చేస్తాయో వాటికి మాత్రం బాగా తెల్సు. ఎందుకంటే  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమో…రాష్ట్ర భవిష్యత్తు కోసమో అని చెప్తారు కదా. ఇది కూడా అట్లాగే కావొచ్చని జనాలు సహజంగనే అనుకుంటున్నారు.