థర్డ్ ఫ్రంట్ పగ్గాల కోసం కేసీఆర్‌తో చంద్రబాబు పోటీ! - MicTv.in - Telugu News
mictv telugu

థర్డ్ ఫ్రంట్ పగ్గాల కోసం కేసీఆర్‌తో చంద్రబాబు పోటీ!

March 8, 2018

‘ఈ దేశ సమాకాలీన రాజకీయాల్లో నేనే సీనియర్ మోస్ట్ లీడర్‌ను. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. విస్తృతమైన అనుభవం నా సొంతం. ప్రాంతీయ పార్టీలు తమతమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చట్టసభ కూడా ఈ దిశగా కీలక పాత్ర పోషించాలి..’ రెండుమూడు రోజులుగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలివి. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరముందని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బాబు నోటివెంట ఈ  మాటలు వస్తున్నాయి.

అవే మాటలు..

రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్, వాగ్దాన భంగానికి పాల్పడి బీజేపీ.. రెండూ ఏపీని నట్టేట ముంచాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు.. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ రెండూ అధోగతికి దిగజార్చాయన్న కేసీఆర్ మాటలకు దగ్గరగా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం దేశంలో సహకార, సమాఖ్య వ్యవస్థలకు తూట్లు పొడుస్తోందని ఇద్దరూ అంటున్నారు. కేసీఆర్ మోదీ ప్ర్రభుత్వాన్ని విమర్శించినట్లే, బాబు కూడా విధిలేని పరిస్థితిలో అదే పనిచేశారు. థర్డ్  ఫ్రంట్ అవసరం, దాని పగ్గాల కోసం ఆరాటం బాబు మాటల్లో లీలగా తొంగిచూస్తోంది. దేశంలో బీజేపీ గాలి వీస్తున్న నేపథ్యంలో తమ అస్తిత్వానికి ముప్పు రాకుండా ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రాంతీయ నేతలు ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి ఉందన్నది కాదనలేని నిజం. వీరిని కాంగ్రెస్‌కు కాకుండా కాషాయ దళానికే ఎక్కువగా భయపడుతున్నారు.అనుభవం..

నిజానికి దేశంలో మూడో కూటమి యత్నాలు కొత్తకాదు. ఎన్నో ప్రయోగాలు, వైఫల్యాలు నమోదై ఉన్నాయి. అయితే అవన్నీ బీజేపీ బలంగా లేని రోజులు. ప్రస్తుతం సీన్ మారింది. ఆ విషయం స్వయంగా సంకీర్ణ రాజకీయాల్లో ఆరితేరిన బాబుకు తెలియనిది కాదు. ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్వయంగా నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించిన వాడే. ఈ విషయంలో కేసీఆర్ అనుభవాలు తక్కువే. అయినా థర్డ్ ఫ్రంట్ మాటకొస్తే తను ఉనికిని ఎవరూ విస్మరించలేరని, అందరినీ కలుపుకుని దానికి సారథ్యం వహించే సత్తా తనకుందని బాబు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రకేబినెట్ నుంచి తన మంత్రులను తప్పించడం ఇందులో భాగమని పరిశీలకులు భావిస్తున్నారు.  థర్డ్ ఫ్రంట్‌లోకి రావాలన్న కేసీఆర్ పిలుపుకు బాబు స్పందించకపోవడం వ్యూహాత్మకమని, ఆయన దేశవ్యాప్త పరిస్థితులను మదింపు వేసి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఎన్డీఏతో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేకపోయినా, థర్డ్ ఫ్రంట్ పుడితే ఆవైపు నుంచి నరుక్కురావడానికి కూడా కావలసిన వ్యూహచతురత బాబు సొంతమని చెబుతున్నారు.