కశ్మీరీ పండిట్ల కథాంశం నేపథ్యంలో ఇటీవల విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రైతు సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ఈ చిత్రాన్ని విడుదల చేయించారని ఆరోపించారు. హిందూ పండిట్ల మీద ఆకృత్యాలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ కాదా? అంటూ ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షనేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, రూ. 12 కోట్లతో రూపొందిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మొదట్లో అభినందనలు అందుకున్న ఈ చిత్రం రోజులు గడిచే కొద్దీ విమర్శలను ఎదుర్కొంటోంది.