బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన గత 7 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలిస్తున్నారు. ఈ ఆందోళనపై టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్.. బాసర విద్యార్థుల సమస్యలు ఏమిటో మీకూ తెలుసా? అంటూ ప్రశ్నించారు. మీరు అక్కడికి వెళ్లరు? మమ్మల్ని వెళ్లనివ్వరు? మరి ఎలా ఆ విద్యార్థుల సమస్యల తీరేది అని మండిపడుతూ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు.
ఆ లేఖలో.. ‘గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్ధులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ, జైలు జీవితం గడుపుతున్నారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదు. సమస్యలను పరిష్కారించాలని విద్యార్ధులు కోరుతుంటే, కరెంట్ నిలిపి వేసి, మంచి నీళ్లు బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటువంటి చర్యలన్నీ ముమ్మాటికి మానవ హక్కలు ఉల్లంఘన కిందకే వస్తాయి. బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మేము వెళ్తే అరెస్టులకు పాల్పడుతున్నారు. విద్యార్థులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అంకుంటిత దీక్షతో ఆందోళనను కొనసాగిస్తుంటే, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు. మీ పుత్రరత్నం కేటీఆర్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారు. ఇది చెప్పి కూడా 5 రోజులైంది. ఎటువంటి అతీగతీ లేదు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని సూటు బూటు వేసుకొని పారిశ్రామికవేత్తలతో ఫొటోలు దిగుతుంటాడు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఒక ఉన్నత విద్యా సంస్థ రాకుండా.. విద్యార్థులకు ఉన్నత విద్య అందని పరిస్థితిల్లో మీరు చెబుతున్న లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడ నుంచి విద్యార్థులకు లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లక్షల ఉద్యోగాలకు ఎవరికి దక్కాయి?’ అని రేవంత్ లేఖలో ప్రశ్నించారు.