విద్యుత్ ఉద్యోగులకు కేసీఆర్  ఇనాం..! - MicTv.in - Telugu News
mictv telugu

విద్యుత్ ఉద్యోగులకు కేసీఆర్  ఇనాం..!

July 29, 2017

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఇప్పటికే ఈ నాలుగు సంస్థలకు చెందిన పాలక మండళ్లు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. దీనిపై శనివారం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు చర్చించారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సిఫారసులు సిద్దం చేసి, ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. ముఖ్యమంత్రి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేశారు. ఏండ్ల తరబడి విద్యుత్ సంస్థలలో తక్కువ జీతం తీసుకుంటూ, ఎంతో శ్రమ చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాన్స్ కో లో 4,197, జెన్ కో లో 2,914, ఎన్.పి.డి.సి.ఎల్. లో 4,333, ఎస్.పి.డి.సి.ఎల్. లో 9,459… మొత్తం నాలుగు సంస్థల్లో కలిపి 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది.

ముఖ్యమంత్రికి ప్రభాకర్ రావు కృతజ్ఞతలు:

విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పి, మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ సంస్థల తరుఫును జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్  సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సహకరించిన మంత్రి జగదీష్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావుకు ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.