కేసీఆర్ వర్సెస్ ఉద్యోగులు వర్సెస్ మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ వర్సెస్ ఉద్యోగులు వర్సెస్ మోదీ

March 29, 2018

             బలహీనుడిని కొట్టాలంటే “బలం” కావాలి. బలవంతున్ని పడగొట్టాలంటే “బుద్ధి” ఉండాలి. జింకను వేటాడడానికి “వేగం” కావాలి. పులిని కొట్టాలంటే “ఓపిక” ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసినంతగా ఈ విషయం ఇంకెవరికీ తెలియదు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏందీ? దాని రుబాబు ఏందని కొన్ని రోజుల నుంచి అగ్గి మీద గుగ్గిలం అయితున్న కేసీఆర్, తన ఆయుధాలన్నింటిని మోదీ మీదకు ఎక్కుపెడుతున్నడు. మొన్న ఎస్సీ వర్గీకరణ, నిన్న ముస్లిం రిజర్వేషన్లతో జనాల ముందు మోదీని దోషిగా నిలబెట్టిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగులను కూడా ఉసిగొల్పుతున్నడు. నరేంద్ర మోదీని నాఖాబందీ చేయడానికి సిపిఎస్ పోరాటాన్ని వాడుకోవాలని  అనుకుంటున్నడు. ఉద్యోగుల ఆవేశాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకుంటున్నడు. అందుకు తగ్గట్టుగా ఒకప్పటి ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్‌లతో మాట్లాడిస్తున్నడు. సిపిఎస్ రద్దు తమ పరిధిలోని అంశం కాదని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని వాళ్లిద్దరూ చెపుతున్నరు. ఉద్యోగుల్లో బీజేపీని బద్నాం చేయడానికి వాళ్లిద్దరూ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నరు. అయితే…….

             సిపిఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నది ఉద్యోగుల విమర్శ. సిపిఎస్ పర్యావసానాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండానే ఒప్పుకుని ప్రభుత్వం తప్పుచేసిందంటున్నరు. అసలు సిపిఎస్ విషయంలో తమకు ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శిస్తున్నరు. దీంతో పాటు ఉద్యోగుల పోరాటంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఆరోపిస్తున్నరు. తమ పోరాటంలో సిపిఎస్ రద్దు ఒక అంశం మాత్రమే అని, అంతకుమించిన తీవ్రమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయంటున్నరు. అందులో కొన్ని…..

              సమైక్యరాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం దగ్గర మంచి పలుకుబడి ఉండేది. కాని తెలంగాణ వచ్చినంక తమను పట్టించుకోవడం లేదని ఉద్యోగసంఘాల నేతలు ఫీలవుతున్నరు. ఉద్యమకాలంలో తమ అండతో ఎదిగిన నాయకులు ఇవాళ తమ ముఖం కూడా చూడడానికి ఇష్టపడడం లేదంటున్నరు. దీంతో పాటు బదిలీల విషయంలో ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని ఆ సంఘాల నాయకులు చెపుతున్నరు. ఎనిమిదేళ్ల నుంచి బదిలీలు లేవని, తెలంగాణ వచ్చినంక ఉద్యోగుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలోకి పడిందంటున్నరు. కొత్త జిల్లాల్లో ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం పనిచేస్తున్న ఉద్యోగులు హెచ్.ఆర్.ఏ భారీగా నష్టపోతున్నారని చెపుతున్నరు.  వీటన్నింటిపై పోరాడుతుంటే సిఎం కేసీఆర్ మాత్రం ఒక్క సిపిఎస్ కోసమే ఉద్యోగులు ఉద్యమిస్తున్నారని చెపుతున్నరని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు.

              ఎస్సీ వర్గీకరణ, ముస్లిం రిజర్వేషన్ల మీద తీర్మానాలు చేసిన ప్రభుత్వం, సిపిఎస్ రద్దు కోసం ఎందుకు చేయడం లేదన్నది ఉద్యోగుల ప్రధాన ప్రశ్న. ఫెడరల్ ఫ్రంట్ అని నరేంద్రమోదీతో డైరెక్ట్ ఫైట్‌కు దిగుతున్న కేసీఆర్, సిపిఎస్ రద్దు విషయంలో స్పష్టమైన వైఖరి ఎందుకు తీసుకోవడం లేదు అని అడుగుతున్నరు. కొంతమంది ఐఏఎస్ అధికారులే సిఎంను తప్పుదారిపట్టిస్తున్నరని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శిస్తున్నరు. అయితే ఉద్యోగుల డిమాండ్లను తీర్చేది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అంటున్నరు.

            తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బలం విద్యార్థులైతే, బలగం ఉద్యోగులు. 60 ఏళ్ల ఆకాంక్షను అస్తిత్వ పతాకంగా మార్చిన “బక్కోడి” ని బలవంతున్ని చేసింది ఈ రెండు శక్తులే. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్‌ను జీరో నుంచి హీరో చేసిన ఆ రెండు వర్గాలు ఇప్పుడు వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.