అనగనగ ఓ రహస్యం - MicTv.in - Telugu News
mictv telugu

అనగనగ ఓ రహస్యం

February 7, 2018

రాజేష్, సురేష్ ఇద్దరు మంచి దోస్తులు. శానా దినాల తర్వాత హైదరబాద్‌ల కలుసుకున్నరు. తెలంగాణ వచ్చినంక ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చిన సురేష్‌ను మంచిగ అర్సుకోవాలనుకున్నడు రాజేష్. నారాయణగూడ కల్లు కాంపౌండ్ ల సురేష్‌ను కూసొబెట్టి కేసీఆర్ సర్కార్‌కు బందబస్తుగా టాక్స్ కట్టాలనుకున్నడు. సిట్టింగ్ అయినంక అట్నుంచి అటే కేఫ్ బహార్‌కు పోయి హైదరాబాద్ శాన్ ల ఫరక్ రాకుండా దమ్ బిర్యానీ తినిపిద్దామనుకున్నడు. ఆ విధంగా కథ కల్లు కాంపౌండ్‌కు చేరింది.

ఫుల్ బాటిల్ ఒడిసినంక సురేష్ అడిగిన ప్రశ్నకు రాజేష్‌కు తాగిందంత దిగింది. “నీ అయ్య గిప్పుడే అడగాల్నరా ఈ ప్రశ్న” అని రాజేష్ కసురుకున్నడు.

“మీ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి ఎందుకు రావడం లేదనే అడిగిన కదా.. ఇందులో నువ్వు ముఖం మాడ్చుకోవడానికి ఏముందిరబై? నీకు మీ సిఎం రైట్, లెఫ్ట్ హ్యాండ్‌లు బాగా క్లోజ్ కదా. పిచ్చిపిచ్చి వేశాలు వేయక ఆన్సర్ చెప్పు” అన్నడు సురేష్.

మందు మీద కూసొని అబద్దం చెప్పుడు రాజేష్ గాడికి రాదాయే. అట్లని ఆంధ్ర దోస్తుగాడి ముందు పెద్దసార్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దాయే. ఎట్లారా రాములా అనుకున్నడు రాజేష్.  ఓ లార్జ్ లోపల పోసుకున్నడు. అప్పుడే ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఇక మొదలుపెట్టిండు.

“ఒరేయ్ సూరిగా…నువ్వు అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్త.. కని దానికంటే ముందు ఓ చిన్న కథ చెప్తా విను అన్నడు. కథ మొదలైంది…..

అనగనగ ఓ పట్నం. అక్కడ ఒక్కటే హోటల్ ఉంది. ఓ ఆదివారం సాయంత్రం ఆరుగొట్టంక ఒకడు  హాటల్‌కు వచ్చి 9 నంబర్ రూం కావాలన్నడు.  సరే అని తాళాలిచ్చిన్రు హోటల్ వాళ్లు. చూడడానికి కొంచెం డిఫరెంట్‌గ ఉండేసరికి హోటల్ వాళ్లు వాన్ని విచిత్రంగా చూసిన్రు. అందుకు తగ్గట్టుగానే హోటల్ల అప్పటిదాకా జరగనివి జరిగినయ్.

ఆ రోజు అర్ధరాత్రి 9 నంబర్ రూం నుంచి అమ్మాయిల ఏడుపు వినిపించింది. దాంతోపాటే మగవాడి అరుపులు భయంకరంగా వినిపించినయ్. లోపల వస్తువులను కింద పడేసి పలగొట్టినట్టు, ఏదో తవ్వినట్టు సౌండ్స్ వచ్చినయ్. అయితే హోటల్ స్టాఫ్ ఎవ్వరూ కూడా ఆ రూంలోపలికి పోయే సాహసం చేయలేదు.

తెల్లారింది. రూంనంబర్ 9 నుంచి వాడు బయటకొచ్చిండు. మామూలుగానే ఉన్నడు. అందరితో నవ్వుతూ మాట్లాడిండు. రిసెప్షన్‌కు పోయి బిల్లు కట్టి రూం ఖాళీ చేసిండు. రాత్రి జరిగిన సంఘటనలతో రూం సిబ్బంది వాడితో మాట్లాడడానికే భయపడ్డరు. వాడు పోయినంక హోటల్ స్టాఫ్ రూంకు పోయి చూసిన్రు. అంతా మాములుగనే ఉంది. రాత్రి విన్నదానికి తెల్లారి చూసినదానికి అస్సలు పొంతనే లేదు.

“మరి రాత్రి సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చినయ్ రా” క్యూరియాసిటీతో సురేష్.

“మొత్తం ఇనుర నీ అయ్య” పెగ్గు కలుపుకుంట రాజేష్

మళ్లీ సండే వచ్చింది. సేమ్ టైమ్‌కు మళ్లా వాడే వచ్చిండు. రిసెప్షెన్‌ల ఉన్నోడికి కింద కారింది. కవర్ చేసుకున్నడు. వాడు మాట్లాడే లోపే వచ్చినోడే  “9 నంబర్ రూం కావాలన్నడు”

“అది ఆల్ రెడీ బుక్డ్” అన్నడు రిసెప్షెనిస్ట్

“డబుల్ పే చేస్తా. నాకు అదే రూం కావాలన్నడు”

మేనేజర్ తో మాట్లాడి  అదే రూం ఇచ్చాడు రిసెప్షనిస్ట్.

“ఆరోజు కూడా అర్ధరాత్రి సేమ్ సౌండ్స్. ఈసారి మరింత భయానకంగా, బీభత్సంగా. హోటల్ స్టాఫ్‌కు తడ్సిపోయింది”

“ఒరేయ్ బాబు నాక్కూడా ఇక్కడ తడిసిపోతుంది రా. అసలు ఏం జరుగుతుంది రా ఆ రూంలో. వాడెవడు? అదే రూం ఎందుకు కావాలంటున్నడు? అర్ధరాత్రి ఆ సౌండ్స్ ఎవరివి?” సురేష్ అడుగుతూ పోతున్నడు

“ఓ…ఓ…ఓ…హోల్డన్ హోల్డన్…కొంచెం ఒప్పిక పట్టురా” కేఫ్ బహార్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తూ రాజేష్.

తెల్లారింది. మళ్లా వాడు వచ్చిండు. బిల్ పే చేసిండు. వెళ్లిపోయిండు. ఇదంత దూరం నుంచి హోటల్ మేనేజర్ చూసిండు. రాత్రి స్టాఫ్ పిలుసుడుతోని మేనేజర్ కూడా హోటల్లనే ఉన్నడు. ఆ సౌండ్స్ తనూ విన్నడు. వాడు రూం ఖాళీ చేసింనక పోయి చూసిండు. అంతా నార్మల్‌గనే ఉంది.

“అరేయ్.. రాజేష్ …కేసీఆర్ సెక్రటేరియట్‌కు ఎందుకు వస్తలేడో తెలసుకోవడం కంటే ఆ రూంల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆత్రుతే ఎక్కువ అయింది రా” అని లెగ్ పీస్‌ను నోట్లో పెట్టుకున్నడు సురేష్.

ముచ్చటగా మూడో ఆదివారం. గడియారం భయం భయంగనే ఆరుగొట్టింది. వాడు రావడం కంటే ముందగనే చీకటి ముసురుకుంది. అదే టైంల వాడు ఎంట్రీ ఇచ్చిండు. ఈ సారి రిసెప్షన్‌ల మేనేజర్ ఉన్నడు. వాడు ఏం అడగకముందే 9 నంబర్ రూం తాళంచెవి ఇచ్చిండు. చిన్నగ నవ్విండు. వాడు కూడా స్మైల్ ఇచ్చి రూంలకు పోయిండు.

రాత్రి మళ్లా అదే కథ.. అవే సౌండ్స్

తెల్లారింది. ఇయ్యాల ఈ కథేందో తెల్సుకోవాలనుకున్నడు మేనేజర్. వాడు వచ్చిండు. బిల్లు కట్టబోతుంటే మేనేజర్ వద్దన్నడు. వాడు సరే అన్నడు. వెళ్లిపోతుంటే “ వన్ మినిట్ సార్” రిసెప్షన్ నుంచి బయటకు వస్తూ మేనేజర్.

కొంచెం ధైర్యం తెచ్చుకుని మేనేజర్.“సార్ నాకో డౌట్. మీరు ప్రతీ ఆదివారం ఇదే హోటల్‌కు ఎందుకు వస్తున్నరు? 9 నంబర్ రూంలనే ఎందుకు ఉంటున్నరు? అర్ధరాత్రి మీ రూం నుంచి ఆ సౌండ్స్ ఎందుకొస్తున్నయ్? తెల్లారి అంతా మాములగానే ఎందుకు ఉంటుంది? మీరు ఆ రూంలో ఏదో చేస్తున్నరు… ఆ సంగతి నాకు అర్థం అయింది. కాని అదేంటో తెలియడం లేదు. కొంచెం చెప్పి పుణ్యం కట్టుకోండి. మీ బిల్లు కూడా తీసుకోలేదు. మీరు చెప్పక తప్పదు”

మేనేజర్ అడిగిన విధానం వాడికి నచ్చింది. అందుకే వాడి చెవులో ఆ రహస్యం చెప్పిండు. ఆ ముచ్చట విన్నంక మేనేజర్ గాడికి ముచ్చెమటలు పట్టినయ్. కర్చీఫ్‌తో ముఖం తుడుచుకున్నడు. ఈ మర్మం ఎవరికి చెప్పొద్దని ప్రామీస్ ఏయించుకుని వెళ్లిపోయిండు.  హోటల్ స్టాఫ్ అంతా మేనేజర్ దగ్గరకు వచ్చిన్రు.

వాళ్లకు చెప్పి ఉంటడు. ఏమని చెప్పాడు” బిర్యానీ తినడం బంద్ చేసి సురేష్ అడిగిండు.

“లేదుర భయ్ మేనేజర్ చెప్తడని అప్పటి నుంచి ఇయ్యాల దాకా వాళ్లంతా వెయిట్ చేస్తున్నరు. కాని ఆ మేనేజర్ గాడు ఇచ్చిన మాట మీద బరాబర్ నిలుసున్నడు” ప్లేట్‌ల రాజేష్ చేయి కడుక్కున్నడు.

సురేష్ కూడా చేయి కడుక్కుని సోంపు నోట్ల వేసుకున్నడు. బిల్లు రాజేష్ కట్టినా, టిప్పు తనే ఇచ్చాడు. అప్పటికే బహార్ మందుకొచ్చిన ఉబర్ క్యాబ్‌ల ఎక్కి ఇద్దరు వెళ్లి పోయిన్రు.

అసలు కేసీఆర్ సచివాలయానికి ఎందుకు వస్తలేడు అన్న ప్రశ్నకు ఈ స్టోరీకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమో పెద్దసార్‌కే తెల్వాలే..

               ఏయ్.. ఎవడ్రా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరుష పదజాలం వాడుతున్నది

                                                             భశుం..