ఇందుకేనా కోదండరామ్ పార్టీ పెడుతున్నడు - MicTv.in - Telugu News
mictv telugu

ఇందుకేనా కోదండరామ్ పార్టీ పెడుతున్నడు

February 7, 2018

భేతాళ రహస్యం

 ఎప్పటిలాగే శింశుపా చెట్టు మీద వేలాడుతున్న భేతాళుణ్ని కిందకు దించి తన భుజం మీదేసుకుని విక్రమార్కుడు మౌనంగా శ్మశానం దిక్కు నడుస్తున్నడు. ఇంతలోనే “రాజా నీకు టైంపాస్ కోసం ఓ కథ చెపుతా విను” అని భేతాళుడు మొదలుపెట్టాడు.

“పూర్వం తెలంగాణ అనే సామ్రాజ్యాన్ని చంద్రశేఖరుడు అనే చక్రవర్తి పాలించేవాడు. అష్టదిక్పాలకులకు కూడా అసూయ పుట్టేలా రాజ్యం చేసేవాడు. ప్రజలకు ఏం కావాలో తనకు మాత్రమే తెలుసన్నట్టు మంత్రివర్గానికి ఒక్క ముచ్చట కూడా చెప్పకుండ అన్ని నిర్ణయాలు తానొక్కడే తీసుకునేవాడు. కోట్లాది పుస్తకాలు చదివిన జ్ఞానంతో కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టేవాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రత్యర్థులందరికి అధికారమనే కుర్చీ వేసి తన సభలోనే కట్టేసుకున్నాడు. అజరామరంగా, ఆచంద్రతారార్కంగా వెలిగిపోతున్న  చంద్రశేఖరుడి పాలనను చూసి ప్రకృతి కూడా పులకించేంది. ఆయన కోరుకున్నప్పుడు వర్షించి రుణం తీర్చుకునేది. దయగల ఆ మహారాజు పాలనలో ప్రజలకు ఆకలి దప్పులు కూడా వేయకపోయేవి. ఎవ్వరి ముఖంలోనైనా సంతోషం సింగూరు డ్యామ్‌ల నీళ్లున్నట్టు నిండుగా ఉండేది. రోజురోజుకు చంద్రశేఖరుడి కీర్తిప్రతిష్టలు ఆకాశపు అంచులను దాటి అంతరిక్షానికి చేరాయి. ఈ అండపిండ బ్రహ్మాండంలో హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి లేదన్నట్టు మహామహులు పెట్టుబడుల సూట్ కేసులు పట్టుకుని శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేవారు.ఇలా సర్వజనామోదితంగా పాలిస్తున్న చంద్రశేఖరుడిని చూసి అతడి ప్రత్యర్థి కోదండరాముడికి కన్నుకొట్టింది. ఈ కోదండుడు పరాయి వాడేం కాదు .ఒకప్పుడు ఇద్దరు కలిసి తెలంగాణ యుద్ధంలో కృష్ణార్జునులుగా కలిసి కొట్లాడినవారే. చంద్రశేఖరుడు అంటే అప్పట్లో కోదండరాముడికి భయంతో కూడిన భక్తి కలగలిసిన వినయం, కోదండుడు అంటే చంద్రశేఖరుడికి విశ్వాసం లేని గౌరవం ఉండేవి. కాని తెలంగాణ కోసం ఇద్దరు కలిసి పనిచేశారు. అనుకున్నది సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్లిద్దరికే తెలియాలి. ఇద్దరు కటీఫ్ అనుకున్నరు. కోదండరాముడు ఎత్తిన కత్తి దించలేదు. చంద్రశేఖరుడు మాత్రం కోదండుడిపైనే కత్తికట్టాడు. ఆయన ప్రశ్నించిన ప్రతీసారి ప్రళయకాల రుద్రుడిలా రెచ్చిపోయాడు. తన మందిమాగధులతో కోదండుడి మానాన్ని తార్నాక సెంటర్‌లో ఎండగట్టిండు. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఓ రోజు అర్ధరాత్రి కోదండుడి ఇంటిపై తన రక్షక భటులను పంపి చిన్నపాటి యుద్దాన్నే ప్రకటించాడు. ఇక్కడే కోదండరాముడి అహం దెబ్బతిన్నది. ఈ క్షణం కోసమే ఎదురుచూసిన చంద్రశేఖరుడి ప్రత్యర్థులైన చేతిగుర్తోళ్లు, కంకికొడవలోళ్లు, వంట చెరుకులు, మన్నూ, మశానం, దుమ్మూ,దుబ్బా అందరూ కోదండరాముడి పక్కకు చేరారు. సింహాసనం నుంచి చంద్రశేఖరున్ని కిందకు దించడమే తక్షణ కర్తవ్యం గా ప్రకటించారు. కోదండుడు కూడా సరే అన్నాడు. యుద్ధం ప్రకటించాడు. అయిననూ హస్తినా పోయిరావలెను అన్నట్టు తలోదిక్కుకు పోయి యుద్ద సన్నాహాలు మొదలుపెట్టారు. వేగులతో ఈ కుట్ర గురించి తెలుసుకున్న చంద్రశేఖరుడు ఎప్పటిలాగే ముసిముసిగా నవ్వుకున్నాడు. పండితులను పిలిచి  తారకరాముడి పట్టాభిషేకానికి మంచి ముహూర్తం చూడమన్నాడు. తోటలోకి వెళ్లి రెస్ట్ తీసుకున్నాడు” అని భేతాళుడు కథ చెప్పడం ఆపి విక్రమార్కుడితో

“ఇప్పుడు చెప్పు విక్రమార్క! మహారాజ తనకు వ్యతిరేకంగా రాజ్యంలో అంత పెద్ద కుట్ర జరుగుతుంటే ఎదుర్కోవాల్సింది పోయి చంద్రశేఖరుడు ఎందుకు నవ్వుకున్నాడు? తన కుర్చీ కిందకే నీళ్లు వస్తుంటే కొడుకు పట్టాభిషేకానికి ముహూర్తం ఎందుకు చూడమన్నాడు?  తోటలోకి వెళ్లి ఎందుకు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు? సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల వెయ్యి  ముక్కలై హుస్సేన్ సాగర్లో పడుతుంది బిడ్డా” అని హెచ్చరించాడు.

భేతాళుడి శాపం కంటే హుస్సేన్ సాగర్ కంపే విక్రమార్కున్ని భయపెట్టింది. దీంతో మౌనం విడి మాట్లాడడం మొదలుపెట్టాడు. “ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది భేతాళా.  అంతా కలిసి ఒక్కటై యుద్ధం చేయకుండా, తలో దిక్కు నుంచి వస్తామంటే ఎలా? అక్కడ ఉన్నది ఎవరు చంద్రశేఖరుడు. హరీష్ లాంటి అరివీరభయంకర సైన్యాధ్యక్షుడు, తారకరాముడి లాంటి మేనే‌ మెంట్ ఎక్స్‌పర్ట్ ఉన్నప్పుడు కోదండరాముడైనా, పరుశురాముడైనా ఏం చేయలేరు. అందుకే ముసిముసిగా నవ్వాడు. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారన్నట్టు, రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖరుడు ఎదుర్కోవాల్సిన ముప్పును కోదండరాముడు తప్పించబోతున్నాడు. అందుకే భవిష్యత్తు మీద బెంగ పెట్టుకోవడం దండగ అని తోటలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. బంగారు తెలంగాణగా మారిన తన సామ్రాజ్యాన్ని వజ్ర తెలంగాణగా మార్చడానికి అక్కడే తీరిగ్గా ఆలోచిస్తాడు. ఇంతే. సింపుల్ ” అనగానే భేతాళుడు భయంకరంగా నవ్వాడు.

“నువ్వూ మారవు విక్రమార్కా..! ఆ చంద్రశేఖరుడి రాజ్యంలోని జనాలలాగా…” అని భుజం మీది నుంచి మాయం అయి మళ్లీ శింశుపా చెట్టు మీదకు పోయిండు.

ఇదో అంతులేని కథ.