టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎవర్ని పంపారాలో అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఔషధాల కంపెనీ హెటిరో అధినేత పార్థసారథి రెడ్డి, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), దీపకొండ దామోదర్ రావు(నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ)లను పెద్దల సంభకు పంపాలని నిర్ణయించారు.
రవిచంద్ర పారిశ్రామికవేత్త కావడంతోపాటు బీసీ కావడం ఆయనకు కలిసొచ్చింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన ఆయన గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హెటిరో అధినేతను రాజ్యసభకు పంపుతారని చాలా రోజుల నుంచే ప్రచారంలో ఉంది. దామోదర్ రావు ఎంపిక కూడా ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. సినీనటుడు ప్రకాశ్ రాజును కేసీఆర్ రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరగడం తెలిసిందే. సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.