తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ లపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న దేశ పరిస్థితుల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోందన్నారు. ప్రధాన మంత్రి మోదీకి రాజకీయాలు తప్ప దేశ పరిస్థితులు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిండెన్ బర్గ్ నివేదికపై మోదీ ఎందుకు మాట్లాడరన్నారు. ఐదారేళ్లుగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నా కేసీఆర్.. కాంగ్రెస్ రాజ్యంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు ఉందా ? అని సూటిగా ప్రశ్నించారు.
” వడ్లు కొనమంటే నూకలు తినమంటూ అహంకారంతో మాట్లాడారు. వడ్లు పండించడంలో పంజాబ్‌తో పోటీ పడుతున్నాం. త్వరలోనే పంజాబ్‌ను దాటేసి మొదటి స్థానంలోకి వెళ్తాం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసి 20 ఏళ్లు దాటింది. కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకావడం లేదు. కాంగ్రెస్, బీజేపీతో కాలేదు కాబట్టే బీఆర్ఎస్ పుట్టింది. 40 వేల టీఎంసీలు ఇస్తే దేశంలో నీటియుద్ధాలే ఉండవు. దీనికి విశ్వగురువులే అవసరంలేదు, దేశ గురువులుంటే చాలు. దేశానికి కొత్త ఇరిగేషన్ పాలసీ అవసరం.ప్రతి ఎకరానికి,ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం. దేశంలో 361 బిలియన్ టన్నుల కోల్ నిల్వలున్నాయి.ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎందుకు దిగుమతి చేసుకోవాలి ?దమ్మున్న ప్రధాని ఉంటే కరెంటు ఎందుకు రాదు ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నారా ? ఒక వందే భారత్ రైలును 14 సార్లు ప్రారంభిస్తారా” అని సీఎం విరుచుకుపడ్డారు.
మన్మోహన్పై ప్రశంసలు
‘ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు, పార్టీలు గెలుస్తున్నాయి. కానీ ప్రజలు ఓడిపోతున్నారు. ఇది ఈ దేశం చేసుకున్న దురదృష్టకరం. కాంగ్రెస్ పాలన సరిగా లేదని 2014లో మోదీకి ఓటేశారు. దాంతో మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. మోదీ గెలిచారు… బీజేపీ గెలిచింది… కానీ దేశ ప్రజలు ఓడిపోయారు. ప్రధానిగా మోదీ కంటే మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారు. కానీ మన్మోహన్ సింగ్ ఎలాంటి ప్రచారాలు చేసుకోలేదు. ప్రముఖ ఆర్థికవేత్త, జర్నలిస్ట్ పూజా మెహ్రా రాసిన ‘ద లాస్ట్ డికేడ్’ అనే పుస్తకంలో మోదీ, మన్మోహన్ సింగ్ పాలనలో ఏం జరిగిందో ఉంది” అని కేసీఆర్ తెలిపారు. దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆరోపించారు.