ఇది ఎన్నికల ఏడాదని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేయాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పలు విషయాలపై నాయకులకు, శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఎక్కడ తేడా వచ్చినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘‘దళిత బంధు విషయంలో కొందరు నాయకుల తీరు బాగాలేదు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొంతమంది పార్టీ నేతలు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేశారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇలాంటివి పునరావృతమైతే సహించే ప్రసక్తే లేదు. కొంతమంది నాయకుల ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. ఇప్పుడే అన్నీ చక్కదిద్దుకోండి’’ అని అధినేత హెచ్చరించారు.
ప్రజల్లోకి వెళ్లండి..
ఇళ్లలో, పార్టీ ఆఫీసుల్లో కూర్చుంటే పనులు కావని, ఎమ్మెల్యేలందరూ కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి, పాదయాత్రలు చేయాలని ఆయన సూచించారు. ‘‘ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వీటి గురించి ప్రజలకు చెప్పండి. ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించండి. మన వారి దగ్గరికి వెళ్తే వారు మనల్ని నమ్ముతారు. ఎమ్మెల్యేలందరూ గ్రామ, మండల స్థాయిల్లో సభలు నిర్వహించాలి. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. విపక్షాలు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దు. తప్పులు ఉంటే దిద్దుకోండి. గెలవబోయేది మనమే’’ అని అన్నారు.