‘‘అమిత్ షా వి పచ్చి అబద్దాలు’’-కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘‘అమిత్ షా వి పచ్చి అబద్దాలు’’-కేసీఆర్

May 25, 2017


తెలంగాణ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అమిత్‌ షా రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారం చేసినందుకు అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… “చిల్లర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తారా…మేం మౌనంగా ఉంటే అంతా నిజమే అనుకుంటారు. రూలింగ్‌లో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి… నేను చెప్పేది తప్పయితే.. అమిత్‌ షా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా. అమిత్‌ షా.. భ్రమిత్‌షా.. వచ్చి నల్గొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే నేను భయపడను. నన్ను వ్యక్తిగతంగా పదిమాటలు తిట్టిన పడతా.రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడితే కాంప్రమైజ్ కాను. ప్రగతి కుంటుపడే విధంగా మాట్లాడితే సహించను. కేంద్రంలో బీజేపీ కాదు.. పీజేపీ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇవ్వాల్సిందే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయి తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదు”అని గణాంకాలతో సహా సీఎం మీడియాకు వివరించారు.

‘‘భారత్‌ను పెంచి పోషిస్తున్న రాష్ట్రాలు ఆరేడు మాత్రమే. దేశాన్ని ఆదుకునే రాష్ట్రాలు తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక. మిగతావన్నీ లోటు రాష్ట్రాలే. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉంటే.. పెన్షన్లు ఇచ్చే గతిలేదని అమిత్‌ షా వ్యాఖ్యానించడం బాధాకరం. రాష్ట్రంలో 38లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల ఖర్చవుతుంది. వాస్తవాలు ఒక విధంగా ఉంటే బీజేపీ నేతలు మరోలా ప్రచారం చేస్తున్నారు ’’అని కేసీఆర్ విమర్శించారు.
‘‘గిమ్మిక్కులతో తెలంగాణ గడ్డ మీద రాజకీయం చేస్తామంటే కుదరదు.హైదరాబాద్‌ నుంచి రూ.లక్ష కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. రూ.లక్ష కోట్ల విదేశీమారక ద్రవ్యాన్ని దేశం కోసం తెలంగాణ అందిస్తోంది. మా అభివృద్ధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారా? . హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ఆందోళన చేశారు. హైకోర్టు విభజన చేయకపోగా.. హైకోర్టు హైదరాబాద్‌లో ఉందంటూ క్రూర పరిహాసం చేస్తారా? హైదరాబాదే తెలంగాణలో ఉంది. తెలంగాణ ఎందుకని గతంలో అడ్వాణీ అన్నారు’’అని విరుచుపడ్డారు కేసీఆర్.

‘‘తెలంగాణ నుంచి కేంద్రానికి ఆదాయపన్ను ద్వారా రూ.32,186 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.7,761 కోట్లు, కస్టమ్స్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.3,328 కోట్లు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రూ.6,828 కోట్లువెళ్లాయి. రాష్ట్రం నుంచి కేంద్రానికి 2016-17లో వెళ్లిన ఆదాయం మొత్తం రూ.50,013 కోట్లు. 2016-17లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు మొత్తం లెక్కిస్తే రాష్ట్రానికి వచ్చింది రూ.24,561 కోట్లు. అంటే తెలంగాణ కేంద్రానికి ఇచ్చే దానిలో కేంద్రం తిరిగి ఇచ్చే దానిలో 50శాతం కూడా లేదు. ఎవరిచ్చే డబ్బులతో ఏ ప్రభుత్వం నడుస్తుందో.. అమిత్‌ షా సమాధానం చెప్పాలి. రూ.25,452 కోట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇస్తున్నామని అమిత్‌ షా తెలుసుకోవాలి. ఆయన చెప్పినవన్నీ అబద్దాలే’’అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏటా అదనంగా రూ.20వేల కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. ఎందులో ఇస్తున్నారో చెప్పాలని చాలెంజ్ చేశారు.

‘‘రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో షెడ్యూల్‌ 13 కింద ట్రైబల్‌, హార్టికల్‌, వెటర్నరీ యూనివర్సిటీ మంజూరు చేయాలని చట్టం చెబుతోంది. ఇంకా ట్రైబల్‌ యూనివర్సిటీ రాలేదు. ఇచ్చినట్టు చెప్పారు.. ఎక్కడుందో అమిత్‌షా చూపెడతారా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుటి నుంచి మే 24 వరకు అన్నీ కలిపి రూ.67,390 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇవి అన్ని రాష్ట్రాలకు వచ్చిన విధంగానే వచ్చాయి.

ఒక్కరూపాయి కూడా అదనంగా రాలేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ బద్ధంగా మూడేళ్లలో వచ్చింది రూ.37,773 కోట్లు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కింద మరో రూ.18,574 కోట్లు. జాతీయ రహదారుల నిర్మాణాలకు ఇప్పటి వరకు మంజూరైన నిధులు 2,055 కోట్లు, బీఆర్‌జీఎఫ్‌ కింద సెక్షన్‌ 94(2) పార్లమెంట్‌ ఆదేశాల ప్రకారం ఇచ్చింది రూ.1,016కోట్లు. ఇది కూడా రెండు వాయిదాల్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మూడు వాయిదాలు చెల్లించేశారు. 14 వ ఫైనాన్స్‌ కమిషన్‌ కింద 5,160 కోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద అడిగింది 8వేల కోట్లు అయితే 850 కోట్లు ఇచ్చారు. సీఎస్‌టీ బకాయిలు 12,147 కోట్లు రావాలి.. కానీ ఇప్పటి వరకు 1957 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 10,190 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమిత్‌ షా అన్నీ అవాస్తవాలు చెప్పారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే సీఎస్‌టీ బకాయిలు వచ్చే విధంగా కృషి చేయాలి’’ కేసీఆర్‌ అన్నారు.