నల్గొండ జిల్లాపై కేసీఆర్ వరాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండ జిల్లాపై కేసీఆర్ వరాలు..

April 29, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా అభివృద్దిపై దృష్టి సారించారు. గురువారం జిల్లా కేంద్రంపై వరాల జల్లు కురిపించారు. నార్కట్‌పల్లి, అద్దంకి హైవే నుంచి నల్లగొండలోకి నేరుగా ప్రవేశించేందుకు మర్రిగూడ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. క్లాక్‌టవర్ వద్ద శిథిలావస్థలో ఉన్న ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ స్థానంలో రూ.25 కోట్లతో 4 అంతస్తులు, 6 స్యూట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు.

అలాగే, కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.10 కోట్లతో ఆర్‌ అండ్‌ బీ కార్యాలయం నిర్మాణాలను వారంలోనే చేపట్టాలని, వీటికి సంబంధించిన జీవోలు జారీ చేయాలని ఆయా శాఖల మంత్రులకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం దశదిన కర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌‌తోపాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా పరిస్థితిపై చర్చించారు. అనంతరం కేసీఆర్ వరాల జల్లు కురించారు.

మరోపక్క గతంలో నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో కేసీఆర్ పర్యటించారు. ఆ పర్యటనలో నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నల్గొండ జిల్లాలో ఉన్న 844 గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని, మండల కేంద్ర అభివృద్ధి కోసం రూ. 30 లక్షలు మంజూరు చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చారు. ఇప్పుడు పలు ఆర్ అండ్ బీ నిర్మాణాలకు నిధులు విడుదల చేశారు.