కేసీఆర్ సర్కార్‌ మరో గ్రీన్‌ సిగ్నల్‌.. ఈసారి 9.5 ఎకరాలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్‌ మరో గ్రీన్‌ సిగ్నల్‌.. ఈసారి 9.5 ఎకరాలు

May 30, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుర్కయాంజాల్‌ పరిధిలో ఉన్న 9.5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లను విక్రయించడానికి మరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. నాగార్జున సాగర్‌ హైవేను ఆనుకొని తుర్కయాంజాల్‌ పరిధిలో ఉన్న విలువైన భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ మరోసారి పచ్చ జెండా ఊపింది. గత ఏడాది రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌లలో ఉన్న భూములను విక్రయించిన విషయం తెలిసిందే. ఆ భూమి అమ్మకంతో సుమారు రూ.2,500 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంది. ఈసారి సుమారు రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మరోసారి కార్యాచరణ ప్రారంభించింది.

ఈ ప్లాట్ల అమ్మకానికి సంబంధించి మంగళవారం హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నాగార్జున సాగర్‌ హైవేను ఆనుకొని తుర్కయాంజాల్‌‌లో ఉన్న 9.5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా వచ్చే నెలాఖరున ఈ–వేలం నిర్వహించనున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్‌ హైవేలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపలవైపు కాలనీలు, మునిసిపాలిటీలకు సమీపంలో ప్రభుత్వం తొలిసారిగా భూముల అమ్మకానికి తెరలేపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులు ఈ 9.5 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌ రూపొందించారు. అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు అనుకూలంగా 600 నుంచి 1,060 గజాల విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల్లో 34 ప్లాట్లను రూపొందించి, హెచ్‌ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఈ వెంచర్‌‌ను వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం వంటి కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు అతిచేరువలో ఉండేలా రెడీ చేశారు.

ఇక ధర విషయానికొస్తే.. చదరపు గజానికి రూ.40వేలుగా నిర్ణయించారు. అప్‌సెట్‌ ప్రైస్‌ కన్నా కనీసం రూ.500 గానీ, అంతకు రెట్టింపులోగానీ వేలంలో ధరను పెంచాల్సి ఉంటుంది. ఈ వేలం బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకొనే వారు జూన్‌ 27 సాయంత్రం 5 గంటలలోగా రూ.1,180 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ కింద జూన్‌ 28లోగా ఒక్కో ప్లాట్‌కు రూ.5 లక్షలు చెల్లించాలి. ఈ–వేలం జూన్‌ 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.