కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి సీజ్ చేస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి సీజ్ చేస్తాం

April 9, 2022

gngng

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో​ ర్యాడిసన్ బ్లూ హోటల్​‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన ఎంత కలకలం రేపిందో తెలిసిందే. పబ్‌లో డ్రగ్స్‌ వాడుతున్నట్లు బయటపడటంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతేకాకుండా రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం కేసీఆర్ ప్రభుత్వం పబ్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పబ్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..”సమాజంలో ఎప్పటినుంచో ఉన్న వీటిని క్రమంగా కూకటివేళ్లతో పెకిలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మొదటి దశలో పేకాట క్లబ్‌లను మూసి వేయించారు. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. పోలీసులను సమన్వయం చేసుకుంటూ అబ్కారీ శాఖ అధికారులు పర్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు.

అంతేకాకుండా చట్టాన్ని అతిక్రమిస్తే అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తాం. మాదర ద్రవ్యాలు విక్రయించే వాళ్లకు రాష్ట్రంలో చోటు లేదు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణకు చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదు. నిజాయితీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తాం. లేకపోతే సీజ్ చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహానగరాల్లో పల సంస్కృతి ఉంది. రాష్ట్రానికి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో పబ్‌లకు అనుమతి ఇచ్చాం.

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే మాత్రం సహించేది లేదు. రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందంటే పబ్‌లను మూసేయడానికి కూడా వెనుకాడేది లేదు. మాదక ద్రవ్యాల వెనక ఎంతటి వాళ్లు ఉన్నా వదలకూడదని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు” అని మంత్రి పేర్కొన్నారు.