రాష్ట్రంలోని విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవ్వాలని యోచిస్తున్నది. వీటితోపాటు సాక్స్‌లు, టై, బెల్ట్, ఐడీ కార్డులను కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నది. దీని కోసం పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల బడులు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లు, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల్లోని 25 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీటికోసం ఏ విధంగా 300 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అంశం ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నదని, ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్కారు బడుల్లోని పలువురు నిరుపేద విద్యార్థులు బడి బ్యాగులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అన్నీ ఓకే అయితే వచ్చే సంవత్సరం నుంచి, ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.