రేపు కార్మికులను చర్చలకు పిలవండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  - MicTv.in - Telugu News
mictv telugu

రేపు కార్మికులను చర్చలకు పిలవండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

October 18, 2019

Rtc high court talks government 

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. కార్మికులు, వివిధ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపిచ్చిన నేపథ్యంలో.. మొండివైఖరి మానుకుని రేపు(శనివారం) ఉదయం కార్మికులకు చర్చలకు పిలవాలని ఆదేశించింది.

మూడు రోజుల్లోగా చర్చలు నిర్వహించి ఈ నెల 28న నివేదికను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కార్మికులు కూడా సమ్మెను విరమించి, చర్చలకు సహకరించాలని సూచించింది. సమ్మె పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ‘ఇది ప్రభుత్వ సమస్యో, కార్మిక సమస్యో కాదు. ఇది ప్రజల సమస్య. పట్టుదలకు పోతే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.. ’ అని పేర్కొన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ వద్దని కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.