కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోకు ఎనిమిదేళ్లు... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడోకు ఎనిమిదేళ్లు…

November 29, 2017

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న ప్రతినతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు ఈ రోజుతో(నవంబర్ 29)తో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29 కేసీఆర్ ఖమ్మం సబ్ జైల్లో దీక్ష చేపట్టారు. 30వ తేదీ రాత్రి పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసీఆర్ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ యావత్తూ నినాదాలతో హోరెత్తింది. పల్లెలు, పట్టణాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు.. మైదానాలు.. ఎక్కడ చూసినా తెలంగాణ ఆకాంక్షే రెపరెపలాడింది.

కేసీఆర్ మొదట సిద్దిపేట కేంద్రంగా దీక్షను ప్రాంరంభించాలనుకున్నారు. అయితే  పోలీసులు కేసీఆర్ దీక్షను భగ్నం చేసి ఖమ్మం జైలుకు తరలించారు. రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ దీక్షను విరమించినట్టు వార్తలు వచ్చాయి.  కేసీఆర్ తమను మోసం చేశారని భావించిన విద్యార్థులు ఆయన శవయాత్రలు చేశారు. అయితే దీక్షను కొనసాగిస్తానని కేసీఆర్ ప్రకంటించారు. తనకు బలవంతంగా నిమ్మ రసం ఇచ్చి దీక్షను భగ్నం చేసేందుకు సర్కారు కుట్రపన్నిందన్నారు.

దీంతో విద్యార్థులు కేసీఆర్‌కు జైకొట్టారు. మరోపక్క.. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందని ఖమ్మం నుంచి హైదరాబాదుకు నిమ్స్‌కు తరలించారు. నిరసనలతో హైదరాబాద్ తగలబడుతోంది అన్న వాతావరణం ఏర్పడింది. నాటి సీఎం రోశయ్య అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క సీపీఎం మినహా పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో వ్యవహారం పార్లమెంటును తాకింది… ఈ క్రమంలో డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు అనూకుల ప్రకటన చేసింది.  తర్వాత కేసీఆర్ దీక్ష విమరించారు. ఈ ప్రకటన  కేసీఆర్ దీక్ష ఫలితమే.